గరుడునిపై గోవిందుడు

15 Oct, 2018 01:23 IST|Sakshi
గరుడ వాహన సేవను తిలకించేందుకు గ్యాలరీల్లో వేచి ఉన్న జనం, గరుడ వాహనంలో మలయప్ప స్వామి

     తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

     భారీగా తరలివచ్చిన భక్తులు

తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు తన ప్రియ వాహనమైన గరుడునిపై ఊరేగుతూ ఆదివారం భక్తకోటికి సాక్షాత్కరించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు అలంకరించారు.

గరుడునితో స్వామికి ఉన్న అనుబంధాన్ని ఈ గరుడ వాహన సేవ లోకానికి తెలియజేస్తోంది. అశేష జనవాహిని గోవిందనామ స్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది. వాహనసేవ ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని అటూఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వయం గా పర్యవేక్షించారు. ఇక వీఐపీల పేరుతో అధిక సంఖ్యలో వచ్చిన వారి మధ్య తోపులాట చోటుచేసుకున్నాయి. వారిని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందిపడ్డారు. వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యా లు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలతో కోలాహలం నిండింది. కాగా మధ్యలో కాసేపు వర్షం పడటంతో ఘటాటోపం నడుమ ఊరేగింపు కొనసాగించారు. 

భక్తజన సంద్రంగా తిరుమల కొండ.. 
గరుడ వాహన సేవను వీక్షించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తజన సంద్రంగా మారాయి. స్వామివారి దర్శనంకోసం ఉదయం నుంచే భక్తులు గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులు గరుడవాహనసేవ కోసం ఎక్కడికక్కడ నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునేందుకు సిద్ధం చేసిన గ్యాలరీల్లో భక్తులు కిక్కిరిసి కనిపించారు.గ్యాలరీల్లో భక్తుల మధ్య తోపులాటలు లేకుండా పరిమిత సంఖ్యలోనే అనుమతించేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు. రోడ్లపై నడిచి మాడ వీధుల్లోకి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా బారికేడ్లు నిర్మించటంతో భక్తులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అర్బన్‌ జిల్లా ఎస్‌పి అభిషేక్‌ మొహంతి పటిష్ట భద్రత కల్పించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు నడిచి వచ్చే భక్తులతో నిండింది.  

మోహిని అవతారంలో గోవిందుడు.. 
బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఆదివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పాలకడలిని మధించడంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసుల బారిన పడకుండా కాపాడిన మహావిష్ణువు కలియుగంలో మాయామోహాల బారిన పడకుండా తన శరణాగతిని పొందాలని ఈ మోహిని అవతారం ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

మరిన్ని వార్తలు