జోరు వానలోనూ అదే అభిమానం

11 Jul, 2018 02:27 IST|Sakshi

భారీ వర్షంతో ప్రజా సంకల్ప యాత్రకు విరామం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మంగళవారం ప్రజా సంకల్ప యాత్ర రద్దయింది. తెల్లవారుజాము నుంచే జల్లులుగా ప్రారంభమైన వాన సాయంత్రం 6 గంటల వరకు కురుస్తూనే ఉంది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. సాధారణంగా రోజూ పాదయాత్రకు బయలుదేరే సమయానికి వర్షపు జోరు ఎక్కువ కావడంతో ఆయన తొలుత ఒక గంట వేచి చూశారు. ఆగితే నడక ప్రారంభిద్దామనుకున్నారు.

ఎంతకీ తగ్గక పోవడంతో మధ్యాహ్నం తర్వాత యాత్ర కొనసాగిద్దామనుకున్నారు. అయితే 3 గంటల వరకూ వేచి చూసినా తెరిపి ఇవ్వలేదు. అయినప్పటికీ జగన్‌ను చూడాలని పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బిక్కవోలు మండలం పందలపాక, కొమరిపాలంలో ప్రతిపక్ష నేతకు స్వాగతం పలకడానికి మహిళలు పాదయాత్ర సాగే మార్గంలో పెద్ద సంఖ్యలో గుమిగూడి వేచి చూశారు. ఏ క్షణంలో నైనా వర్షం తగ్గకపోతుందా.. అభిమాన నేతను దగ్గర నుంచి చూడకపోతామా అని నిరీక్షించారు.

జగన్‌ బస చేసిన శిబిరం వద్దకు కూడా జనం తరలి వచ్చారు. అయితే అప్పటికే పాదయాత్ర సాగాల్సిన రహదారి మొత్తం బురదమయం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడం జననేతకు ఇష్టం లేనందున పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. మంగళవారం పాదయాత్ర సాగాల్సిన మార్గంలో బుధవారం కొనసాగుతుందని చెప్పారు.    

మరిన్ని వార్తలు