మామిడి..దళారుల దోపిడీ

13 May, 2019 10:11 IST|Sakshi
మామిడి కాయలు లేక వెలవెలబోతున్న పుత్తూరు మార్కెట్‌ యార్డు

భారీగా తగ్గిన పంట దిగుబడి

పడిపోయిన ధర

రూ.పదికి మించని తోతాపురి

వ్యాపారుల సిండికేట్‌...?

గగ్గోలు పెడుతున్న రైతులు

షరా మామూలే ఈ ఏడాదీ మామిడి ధరలు నేల చూపు చూస్తున్నాయి. పూత దశలోప్రతికూల వాతావరణం జిల్లాలో మామిడి దిగుబడిపై గణనీయ ప్రభావం చూపింది.సాధారణ దిగుబడిలో ఈ ఏడాది 30 శాతం మించి వచ్చే పరిస్థితి లేదని ఉద్యానవన శాఖఅంచనా వేస్తోంది. అదే సమయంలో మళ్లీ మామిడి వ్యాపారులు సిండికేట్‌ అయ్యారనేఆరోపణలూ వినిపిస్తున్నాయి. దిగుబడి లేక కుదేలైన మామిడి రైతుకు ధరలు ఆశాజనకంగాలేకపోవడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

పుత్తూరు: జిల్లాలో మామిడి సీజన్‌ నిరాశాజనకంగా ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఆలస్యంగా రావడం, వచ్చిన సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో మామిడి పూత తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో దిగుబడి లేక మామిడి తోటలు వెలవెలబోతున్నాయి. సాధారణ దిగుబడిలో 30 శాతం కన్నా తక్కువే వచ్చే అవకాశమున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తుండడం పరిస్థితిని తెలియజేస్తోంది.

వెలవెలబోతున్న యార్డులు
జిల్లాలో తిరుపతి, దామలచెరువు, చిత్తూరు, పుత్తూరు, బంగారుపాళెం మామిడికి ప్రధాన మార్కెట్లు. సీజన్‌లో సాధారణంగా రోజుకు పదివేల టన్నులకు పైగా మామిడి వ్యాపారం జరుగుతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కోల్‌కతా తదితరమహానగరాలకు నిత్యం వేల టన్నుల మామిడి ఎగుమతి అవుతుంది.  అయితే ఈ ఏడాది దిగుబడి లేకపోవడంతో రోజుకు ఐదు వందల టన్నులకు మించి మామిడి యార్డులకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా ఏటా మేలో మామిడి కాయల వ్యాపారంతో కళకళలాడే మార్కెట్‌ యార్డులు వెలవెలబోతున్నాయి. సగం సీజన్‌ ముగుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో మండీలు తెరుచుకోలేదు.

తోతాపురి..రైతు ఉక్కిరిబిక్కిరి
జిల్లాలో సుమారు 1.1 లక్షల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ప్రధానంగా పల్ప్‌ ఫ్యాక్టరీల్లో వినియోగించే తోతాపురి రకాన్ని 70 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గత ఏడాది తోతాపురి రకం టన్ను ధర రూ.5 వేలకు పడిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు ఉద్యమించారు. దిగివచ్చిన ప్రభుత్వం టన్ను తోతాపురి రకానికి రూ.2,500 అదనపు మద్దతు ధరను ప్రకటించింది. పల్ప్‌ ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన రైతులకు యాజ మాన్యం చెల్లించే రూ.5 వేలతో పాటు ప్రభుత్వం మరో రూ.2,500 కలిపి టన్నుకు రూ.7,500 చెల్లించింది. లక్ష టన్నులకు పైగా సరఫరా చేసిన రైతులకు రూ.28 కోట్లు ప్రభుత్వం చెల్లించినట్లు సమాచారం. తద్వారా గత ఏడాది గండం నుంచి గట్టెక్కిన మామిడి రైతు.. ఈ ఏడాది మళ్లీ సమస్య పొంచి ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.

కలెక్టర్‌ స్పందించాలి
ఏటా వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. గత ఏడాది అనేక పోరాటాలు చేస్తే ప్రభుత్వం అదనపు ధరను చెల్లించేందుకు ముందుకు వచ్చింది. సాగు ఖర్చులు ఎకరాకు రూ.40 వేలు ఉండగా దిగుబడి లేకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారు. అందివచ్చిన పంటనైనా మంచి ధరకు విక్రయించి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ దళారుల అత్యాశ కారణంగా రైతు మోసం పోతున్నారు. కలెక్టర్‌ స్పందించి సిండికేట్ల నుంచి మామిడి రైతును కాపాడాలి.    – రవిశేఖర్‌రాజు, మామిడి రైతు, పుత్తూరు

నియంత్రణ ఏదీ..?
మామిడి రైతులు కష్టాలను సాగు చేస్తున్నారు. ధర ఉంటే దిగుబడి ఉండదు.. దిగుబడి ఉంటే ధర ఉండదు. కానీ ఈ ఏడాది దిగుబడి లేనప్పటికీ ధర కూడా లేకపోవడం దారుణం. వ్యాపారులు, పల్ప్‌ ఫ్యాక్టరీలు సిండికేట్‌గా మారి రైతుకు తక్కువ ధరను చెల్లిస్తున్నారు. మార్కెట్‌ యార్డులో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు సిండికేట్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఈ సిండికేట్లను నియంత్రిస్తే తప్ప రైతుకు న్యాయం జరగదు.        – పద్మనాభశెట్టి, మామిడి రైతు,    సురేంద్రనగరం, కార్వేటినగరం మండలం

వ్యాపారుల సిండికేట్‌..?
సాధారణంగా పరిశ్రమలు ఏర్పాటైతే ముడి సరుకుకు గిట్టుబాటు ధర లభిస్తుంది.  అయితే మామిడికి మాత్రం విలోమానుపాత సూత్రం వర్తిస్తున్నట్లుంది. జిల్లాలో పల్ప్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాక మామిడికి గిట్టుబాటు ధర లభించడం మృగ్యమైందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆరుగాలం శ్రమించి దిగుబడి సాధించిన రైతుకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలతో కుమ్మక్కై తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల సిండికేట్‌ కారణంగానే ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ తోతాపురి రకం టన్ను కు రూ.పదివేలకు మించి పలకడం లేదు. రైతులకు రూ.పదికి మించి దక్కని మామిడి ధర బహిరంగ మార్కెట్లలో మాత్రం ఆకాశంలో ఉన్నాయి. తోతాపురి రకం కేజీ రూ.80 లెక్కన వ్యాపారులు మార్కెట్లలో విక్రయిస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.45 వేలు పలికిన బంగినపల్లి (బేనీషా) రకం ప్రస్తుతం రూ.20 నుంచి 25వేలకు పడిపోయిందని గుర్తు చేస్తున్నారు. పండించే రైతు కన్నా వ్యాపారులకే మామిడి సాగు లాభాలను తెచ్చిపెడుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. సిండికేట్ల నుంచి రైతులను కాపాడాలని మామిడి రైతుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మామిడికి గిట్టుబాటు ధర లభించేలా కలెక్టర్‌ పీఎస్‌.ప్రద్యుమ్న చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా