ప్రగతి చక్రం..బస్సు వీడి పరుగులు!

30 Jun, 2018 09:02 IST|Sakshi
చక్రాలు ఊడిన ఆర్టీసీ బస్సు, రోడ్డుకు తాకిన చక్రాల రాడ్‌

ఆర్టీసీ బస్సు నుంచి ఊడిన రెండు చక్రాలు

వేగాన్ని నియంత్రించి బస్సును ఆపిన డ్రైవర్‌  

కణేకల్లు: రాయదుర్గం ఆర్టీసీ డిపో బస్సుకు శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే ఏపీ02జెడ్‌ 1066 ఆర్టీసీ బస్సు ఉరవకొండకు వెళ్లేందుకు ఉదయం 7గంటలకు రాయదుర్గంలో బయలుదేరింది. 7.35 గంటలకు కణేకల్లులోని రామనగర్‌కు రాగానే ఒక్కసారిగా బస్సుకు కుడివైపున వెనుకున్న రెండు చక్రాలు బోల్టులు లూజై ఊడొచ్చాయి. బస్సు రన్నింగ్‌లో ఉండగా ఉన్నట్టుండి బ్యాలెన్స్‌ తప్పి కుడివైపులాగుతుండటంతో డ్రైవర్‌ వన్నూర్‌సాబ్‌కు అనుమానం వచ్చింది.

దీంతో వేగాన్ని కంట్రోల్‌ చేశాడు. అయినప్పటికీ రెండు చక్రాలూ ఊడి బయటికొచ్చాయి. బస్సు ఒక్కసారిగా కుడివైపు ఒరిగి నాలుగు అడుగుల దూరం వరకు వెళ్లింది. ఆ సమయంలో 15 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. డ్రైవర్‌ అప్రమత్తమై బస్సు వేగాన్ని నియంత్రించడంతో ప్రమాదం త్రుటిలో తప్పిందని ప్రయాణికులు తెలిపారు. మరో 40 అడుగుల దూరంలో బస్టాప్‌ ఉండటంతో బస్సు తక్కువ స్పీడ్‌తో వస్తోంది. దేవుని దయవల్ల ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు ఊపీరి పీల్చుకొన్నారు.

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై  ప్రయాణికుల ఆగ్రహం
రాయదుర్గం – ఉరవకొండ మార్గంలో కండీషన్‌ లేని డొక్కు బస్సులు తిప్పుతున్నారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపో నుంచి బయటికొస్తున్న బస్సుల కండీషన్‌ను సైతం అధికారులు పరీక్షించడం లేదని వాపోతున్నారు. కణేకల్లులో శుక్రవారం ఆర్టీసీ బస్సుకు రెండు చక్రాలు ఊడిరావడంతో ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీకి ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. ఆటోలో ప్రయాణం ప్రమాదకరం– ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని చెప్పడం కాదని.. డొక్కు బస్సులను ఆపేసి కండీషన్‌ ఉన్న బస్సులను నడపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు