అప్పు కోసం ‘తప్పు’.. అసలుకే ముప్పు?

12 Mar, 2018 03:15 IST|Sakshi

ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికి బడ్జెట్‌లో లెక్కల మాయ

రూ.5,235 కోట్ల మేర రెవెన్యూ మిగులు

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి తప్పుడు సంకేతాలు 

రెవెన్యూ లోటు భర్తీని కేంద్రం ఎగ్గొట్టే అవకాశం 

రాష్ట్రానికి భారీ నష్టం తప్పదంటున్న అధికారులు 

రూ.వేల కోట్ల నిధులను ఆపేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్న

సాక్షి, అమరావతి: లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి చట్ట ప్రకారం ఆర్థిక సాయం చేస్తామని చెబితే అదేం వద్దంటోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. మా దగ్గర అవసరాని కంటే ఎక్కువ డబ్బులున్నాయి, మీ సాయం మాకేం అక్కర్లేదని ముఖం మీదే చెబుతోంది. ఎందుకు ఇలా చేస్తోందని ఆరా తీస్తే... బయటి నుంచి ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికట! ఈ పరిణామం పట్ల అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్రం నుంచి పొందడానికి ప్రభుత్వం ఇప్పటికే తిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లయినా రెవెన్యూ లోటు కింద రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో రాబట్టలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లేనని అధికారులు చెబుతున్నారు. సర్కారు అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటున్నారు.  

కేంద్రానికి దొరికిన సాకు 
2015–16 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటులో ఉంటుందని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద 2015 నుంచి 2020 వరకు రాష్ట్రానికి రూ.22,113 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. 2019–20 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉంటుందని సాక్షాత్తూ 14వ ఆర్థిక సంఘమే స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.5,235 కోట్ల మేర రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. దీనివల్ల కేంద్రానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నామో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీలో మిగులు బడ్జెట్‌ ఉందనే సాకుతో కేంద్రం 2018–19లో రెవెన్యూ లోటు కింద నిధులు ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 14 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద కేంద్రం నుంచి 2018–19లో రూ.3,644 కోట్లు, 2019–20లో రూ,2499 కోట్లు రావాల్సి ఉంది. 2014–15లో 10 నెలలకు ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.4,000 కోట్లు ఇచ్చామని, ఇక రూ.138 కోట్లే వస్తాయని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. 

అప్పుల కోసం నిధులు పణం!
రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం(ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలను సడలించాలని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి బదులు 3.5 శాతం మేర అప్పులు తెచ్చుకునేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతోంది. అయితే, రెవెన్యూ మిగులున్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఆ వెసులబాటు కల్పించింది. రెవెన్యూ మిగులున్న రాష్ట్రాలు తమ స్థూల ఉత్పత్తిలో 3.5 శాతం మేర అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రెవెన్యూ మిగులులో ఉన్నందున ఇటీవలే ఆ రాష్ట్రానికి 3.5 శాతం మేర అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు నిధులను పణంగా పెట్టడం సమంజసం కాదని అంటున్నారు. 

కేంద్రం మొండిచెయ్యి చూపితే? 
14వ ఆర్థిక సంఘం కాలపరిమితి 2019–20తో ముగుస్తుంది. ఆ తరువాత 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. 14వ ఆర్థిక సంవత్సరం కాలపరిమితి ముగిసిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటును ఎదుర్కోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో 15వ ఆర్థిక సంఘం ముందు సమర్థంగా వాదనలు వినిపించి, రెవెన్యూ లోటు కింద నిధులు పొందడానికి కృషి చేయాల్సింది పోయి ఇప్పుడే మిగులు బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెడతారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ ఉంటే రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం మొండిచెయ్యి చూపే అవకాశం ఉందని ఒక అధికారి చెప్పారు. 

ఏపీలో ఏటా లోటు బడ్జెట్‌ 
రాష్ట్ర ప్రభుత్వం 2015–16 నుంచి బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. ప్రతి బడ్జెట్‌లోనూ రెవెన్యూ లోటును తక్కువగా చూపించినప్పటికీ సవరించిన అంచనాల్లో ఈ లోటు భారీగా పెరిగిపోతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.6,709 కోట్ల మేర ఏర్పడుతుందని పేర్కొనగా, వాస్తవానికి రూ.7,301 కోట్ల లోటు ఏర్పడింది. 2016–17 బడ్జెట్‌లో రూ.5,047 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని పేర్కొనగా, వాస్తవ అకౌంట్ల మేరకు రూ.17,231 కోట్ల లోటు తలెత్తింది. 2017–18 బడ్జెట్‌లో రూ.415 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని ప్రస్తావించగా, సవరించిన అంచనాల్లో రూ.4,018 కోట్ల లోటు ఏర్పడింది. రాష్ట్రంలో రెవెన్యూ లోటు భారీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌ను చూపడం గమనార్హం. 

రెవెన్యూ మిగులు అసహజంగా ఉంది
ఎన్నికలకు ముందు సాధారణంగా సంక్షేమ పథకాలతో రెవెన్యూ వ్యయానికి ఎక్కువగా కేటాయిస్తారు. ఇలాంటప్పుడు రెవెన్యూ లోటు మరింత పెరుగుతుంది. కానీ రెవెన్యూ మిగులు చూపెట్టడం అసహజంగా ఉంది. వరుసగా గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రెవెన్యూ లోటుతో పెట్టగా.. ఇప్పుడు హఠాత్తుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఆశాజనకంగా అయిపోయిందా! ఇంత ఆశాజనకంగా ఉంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మించి ఆర్థిక వెసులుబాటు పొందడం కష్టతరం అవుతుంది. ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన సామర్థ్యం వలన ఈ బడ్జెట్‌ ఇంత ఆశాజనంగా రూపొందితే మనకిక ఎవరి సహాయం అవసరం ఉండకపోవచ్చు. లేక ఈ అంకెలన్నీ గారడీ అయితే అన్ని విధాలా మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది.
– ఐవైఆర్‌ కృష్ణారావు,ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు