దారి దోపిడీ ముఠా అరెస్టు

12 Mar, 2018 03:10 IST|Sakshi

రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి.. తుపాకీతో ఫైరింగ్‌..  

రూ.77 వేలు అపహరణ నిందితుల అరెస్టు.. నగదు స్వాధీనం: ఏసీపీ

నందిగామ (షాద్‌నగర్‌) : రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తి నుంచి రూ.77,300 అపహరించిన ముఠాను పోలీసులు 24 గంటల్లోపే కటకటాల వెనక్కి పంపారు. షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మద్దూరు అనుబంధ బీక్యా తండాకు చెందిన కేత్లావత్‌ దశరథ్‌ కొంతకాలంగా కొత్తూరు మండల కేంద్రంలో ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

కొత్తూరుకు చెందిన సున్నపు గంగారాం, అతడి స్నేహితుడు చేగూరు తండాకు చెందిన ఆంగోతు రతన్‌ దశరథ్‌ వద్ద డబ్బులను కాజేయాలని పథకం వేశారు. ఈ విషయాన్ని ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లికి చెందిన మరో స్నేహితుడు నేనావత్‌ రమేశ్‌కు తెలిపారు. రమేశ్‌.. రాజేంద్రనగర్‌ మండలం కిస్మత్‌పూర్‌కు చెందిన షేక్‌ ఇర్ఫాన్‌ (పాత నేరస్తుడు)కు తమ ప్లాన్‌ చెప్పాడు.

వీరంతా కలసి శనివారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వెళుతున్న దశరథ్‌ను మార్గమధ్యంలో రాళ్లు పెట్టి ఆపారు. వారి నుంచి తప్పించుకొని దశరథ్‌ పారిపోతుండగా అతడి వద్దనున్న నగదు బ్యాగును లాక్కుని, తుపాకీతో గాల్లోకి ఒకరౌండ్‌ కాల్పులు జరిపి పారిపోయారు.

24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
దశరథ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ మధుసూదన్, ఎస్సైలు శ్రీశైలం, హరిప్రసాద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు సం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆదివారం ఉదయం తిమ్మాపూర్‌ చెక్‌పోస్టు వద్ద దోపిడీ ముఠా సభ్యులు రమేశ్, ఇర్ఫాన్, రతన్‌ ద్విచక్రవాహనంపై అనుమానాస్పద స్థితిలో వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

దీంతో చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. వారి సమాచారంతో కొత్తూరుకు చెందిన సున్నం గంగారాంను కూడా పోలీసులు అరెస్టు చేశా రు. వారి నుంచి రూ.77,300 నగదు, 6 ఎం. ఎం.తుపాకీ, 8 తూటాలు, వాడిన తూటా, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్ల డించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

మరిన్ని వార్తలు