మృత్యు శకటాలు

7 Nov, 2018 12:42 IST|Sakshi
అనుమంచిపల్లి వద్ద శనివారం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు (ఫైలు)

నిలిచిన వాహనాలే ప్రమాద హేతువులు

హైవేలపై వే బైలు ఉన్నా.. నిరుపయోగం

చేష్టలుడిగిన పెట్రోలింగ్‌ సిబ్బంది

కోస్తాంధ్ర నడిబొడ్డుగా, నవ్యాంధ్ర రాజధానిగా ఉన్న కృష్ణా జిల్లా గుండా నాలుగు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. రవాణా రంగానికి జీవనాడిగా ఉన్న ఈ హైవేలు.. ప్రమాదానికీ అంతే హేతువులవుతున్నాయి. వాహన చోదకులు వే బేలు ఉన్నచోట కాకుండా తమకు నచ్చిన చోట రోడ్డుపైనే లారీలు, ట్రాలీలు నిలుపుతున్నారు. వెనుక నుంచి వస్తున్న చిన్న వాహనాలు వీటిని ఢీకొని ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారింది. వీరిని హైవే అథారిటీ, పోలీసు పెట్రోలింగ్‌ సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. ఈ మృత్యు పరంపర మూలాలు, కేంద్రాలు, పరిష్కార మార్గాలపై ‘సాక్షి’ కథనం.

సాక్షి, అమరావతిబ్యూరో : వాహన రాకపోకల క్రమమైన నియంత్రణతోపాటు ప్రమాదాల్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా జాతీయ రహదారుల్ని విస్తరించింది. ఆచరణలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఉద్దేశాలు నెరవేరడం లేదు. జిల్లా పరిధిలో చెన్నై–కోల్‌కతా, మచిలీపట్నం–హైదరాబాద్, పామర్రు–కత్తిపూడి, మచిలీపట్నం–తిరువూరుల జాతీయ రహదారులే ఇందుకు నిదర్శనం. హైవేలపై ఎలాంటి అవరోధాలు లేకుండా ఉంటేనే రాకపోకలు వేగవంతంగా సాగుతాయి. కానీ జాతీయ రహదారులపై గల్లీ రోడ్ల కంటే దారుణంగా వాహనాలను నిలుపుతున్నారు. చెన్నై–కోల్‌కతా రహదారిలో ప్రసాదంపాడు నుంచి గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం, బొమ్ములూరు వరకు ఇదే పరిస్థితి.

అవే మృత్యు నెలవులు..
హోటళ్లు, మద్యం షాపులు, రెస్టారెంట్లు, పెట్రోలు బంకుల వద్ద డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుండటంతో అక్కడే వాహనాలను రోడ్డుపైన నిలుపుతున్నారు. ఇవే ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. చిల్లకల్లు సైడ్‌ ట్రాక్‌ వద్ద భద్రత లేక చోరీలు జరుగుతుండటంతో వాహనాలు ఆపటం లేదు. గరికపాడు, అనుమంచిపల్లి శివారులో, అనుమంచిపల్లి క్రాసింగ్, షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు, చిల్లకల్లు, గౌరవరం, నవాబుపేట అడ్డురోడ్డు, మునగచర్ల అడ్డురోడ్డు హోటళ్ల వద్ద, నందిగామ, కంచికచర్ల మెయిన్‌రోడ్డు, బైపాస్‌ రోడ్లలో, అనాసాగరం అడ్డరోడ్డు, కీసర, కంచికచర్ల, పరిటాల, ఎంవీఆర్, అమృతసాయి ఇంజినీరింగ్‌ కళాశాలల క్రాస్‌రోడ్ల వద్ద, మూలపాడు, కేతనకొండ, ఇబ్రహీంపట్నం ఆర్టీ చెక్‌పోస్టుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పట్టించుకునే నాథుడేడి?
ట్రక్‌ వే బైలు ఉన్నచోట మినహా హైవేలపై వాహనాలను నిలుపరాదనేది నిబంధన. కానీ ఆచరణలో ఇది ఎక్కడ అమలు కావడం లేదు. హైవే అథారిటీ, పోలీసు శాఖకు చెందిన పెట్రోలింగ్‌ సిబ్బందికి ఈ పర్యవేక్షణ నిమిత్తం వాహనాలను సమకూర్చినా వారు సరిగ్గా తిరగడం లేదని జరుగుతున్న ప్రమాదాలే రుజువు చేస్తున్నాయి. పోలీ సు పెట్రోలింగ్‌ వారు జంతువులు, సరుకు అక్రమ రవాణా చేసే వారి నుంచి మామూళ్లు వసూలు చే సుకోవడానికే పరిమితమయ్యారన్న ఆరోపణలున్నాయి.

దుర్ఘటనలకు కేంద్ర బిందువులు
భారీ వాహనాలను జాతీయ రహదారులపై నిలుపుతున్నందున వెనక నుంచి వచ్చే కార్లు వీటిని ఢీకొనడంతో ప్రమాదాలు సంభవిస్తున్నా యి. కనీసం రేడియం స్టిక్కర్లు కూడా సరిగ్గా ఉండక దగ్గరకు వచ్చే వరకూ ఆపి ఉన్న వాహనాలు కనపడక అధికశాతం అనర్ధాలు జరుగుతున్నాయి. వాహన చోదకులు విశ్రాంతి తీసుకోవడానికి విజయవాడ–హైదరాబాద్, విజయవాడ–కోల్‌కతా మార్గంలో చిల్లకల్లు, మూలపాడు, ఎనికేపాడు తదితర ప్రాంతాల్లో నిర్మించిన ట్రక్‌ లే బైలు వద్ద కనీస సౌకర్యాలు సరిగా లేవు. లేబేల ఉద్దేశమే విశ్రాంతి కోసం అయినప్పుడు.. అక్కడ మూ త్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంతి హాలు తప్పనిసరి. కాగా.. చాలాచోట్ల అవేమీ లేని కారణంగా వే బైలు వద్ద డ్రైవర్లు వాహనాలు నిలపట్లేదు. ఎనికేపాడులోనూ అంతే.. మూలపాడు వద్ద రెండు వైపులా ట్రక్‌ వే బైలు ఉన్నా ఇక్కడ వాహనాలు నిలపట్లేదు.

మరిన్ని వార్తలు