పేదోడి గుండెకు భరోసా

21 Sep, 2019 11:49 IST|Sakshi
యాంజియోగ్రామ్‌ చేస్తున్న వైద్య బృందం

కార్పొరేట్‌ తరహాలో పేదలకు వైద్యం

24 గంటలూ క్యాథ్‌ల్యాబ్‌ సేవలు

అత్యాధునిక పద్ధతుల్లో గుండె ఆపరేషన్లు

రేషన్‌ కార్డు లేకపోయినా ఉచిత వైద్యం

గుంటూరు మెడికల్‌: కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పతి గుండె వైద్య విభాగంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నారు. కార్డియాలజీ పీజీ వైద్యులు పేద రోగులకు అందుబాటులో ఉండి నిరంతరం గుండె వైద్యసేవలను అందిస్తున్నారు. జీజీహెచ్‌ క్యాథ్‌ల్యాబ్‌లో అన్ని రకాల గుండె జబ్బులకు ఆధునిక వైద్య పద్ధతులు ఉపయోగించి ఆపరేషన్లు పూర్తిచేస్తూ పేదోళ్ల గుండెకు కార్డియాలజీ  వైద్యులు అభయాన్ని ఇస్తున్నారు.

మనిషి శరీరంలో గుండె కీలకం
శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది.లబ్‌డబ్‌ మంటూ నిరంతరం కొట్టుకుంటూ ఉండే గుప్పెడంత గుండె కొద్దిసేపు విశ్రమిస్తే ప్రాణాలు గాల్లో కలిసినట్లే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెకు వైద్యం కూడా చాలా ఖరీదుతో కూడుకున్నదే. గతంలో కేవలం కొద్ది రకాల గుండె వ్యాధులకు మాత్రమే జీజీహెచ్‌ గుండె వైద్యవిభాగంలో సేవలు లభించేవి. ఆపరేషన్లు చేయాలంటే హైదరాబాద్‌కు రిఫర్‌ చేసేవారు. నేడు మెట్రోపాలిటన్‌ నగరాల్లో లభించే కార్డియాలజీ వైద్యసేవలన్నీ జీజీహెచ్‌లో ఉచితంగా లభిస్తున్నాయి.

అందిస్తున్న వైద్యసేవలు
క్యాథ్‌ల్యాబ్‌లో గుండెలో రక్తనాళాలు మూసుకుపోయి గుండె నొప్పితో బాధపడేవారికి యాంజి యోగ్రామ్‌ పరీక్ష చేసి బైపాస్‌ ఆపరేషన్‌ చేయాలో వద్దో నిర్ణయిస్తారు. గుండె రక్త నాళాలు మూసుకున్న వారికి మూసుకున్న రక్తనాళంలో ప్లాస్టిక్‌ గొట్టం(యాంజీయోప్లాస్టీ) స్టెంట్‌ వేస్తారు. గుండె సరిగా కొట్టుకోని వారికి పేస్‌మేకర్‌(తాత్కాలిక, శాశ్వత)ని అమరుస్తారు. గుండె కవాటాల సమస్యలు ఉన్నవారికి ఇక్కడ పీబీఎంవీ, పీబీవీపీ వైద్య పద్ధతిలో వైద్యం చేస్తారు. చిన్న పిల్లల్లో గుండెలో రంధ్రాలు పూడిపోకపోతే వాటిని మూసివేసే ఆపరేషన్లు(ఏఎస్‌డీ, వీఎస్‌డీ క్లోసర్‌) చేస్తారు. కాళ్లు ,చేతుల్లో రక్తనాళాలకి కూడా ప్లాస్టిక్‌ గొట్టాలు వేస్తారు.

వైద్య సేవలు పొందాలంటే...
జీజీహెచ్‌లో లభించే గుండె వైద్య సేవలు పొందాలనుకునే వారు అవుట్‌ పేషెంట్‌ విభాగంలోని 10 నంబర్‌ గదిలో సోమవారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు వైద్య సేవలు పొందవచ్చు. అక్కడ వైద్యులు ఈసీజీ, టుడి ఎకో, ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ లాంటి గుండెజబ్బు నిర్ధారణ పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి ఇన్‌పేషేంట్‌ విభాగంలో అడ్మిట్‌ చేసుకుంటారు. ఇన్‌పేషేంట్‌ విభాగంలో(డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌)లో  24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారు. హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చినవారిని ఓపీకి తీసుకెళ్లకుండా  నేరుగా వార్డులోకి తీసుకురావచ్చు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీకార్డు, తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి క్యాథ్‌ల్యాబ్‌లో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే గుండె వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. కార్డు లేనివారికి సైతం  సీఎమ్‌సీఓ ఆఫీసు నుంచి అనుమతి పత్రం  తెచ్చుకుంటే సేవలన్నీ ఉచితమే.

అందుబాటులో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు
గుండెజబ్బుల వైద్య విభాగంలో గత ఏడాది డిసెంబర్‌ నుంచి  24 గంటలు క్యాథ్‌ల్యాబ్‌ వైద్యసేవలు అందుబాటులోకి రావటంతో గుండెజబ్బు రోగులకు సకాలంలో వైద్యసేవలు అందుతున్నాయి. గుండె ఆపరేషన్లు చేసేందుకు ఫిలిప్స్‌ కంపెనీకి చెందిన అజురియన్‌ 7.సి అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ మిషన్‌ను  ఏర్పాటుచేశా>రు. నీతి అయోగ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏపీలో క్యాథ్‌ల్యాబ్‌ను మొట్టమొదట గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటుచేశారు. సుమారు రూ.4. 5 కోట్లతో ఏర్పాటుచేసిన ఆధునిక క్యాథ్‌ల్యాబ్‌తో 50 శాతం రేడియేషన్‌ తక్కువగా ఉంటుంది.

గుండె జబ్బులను   అశ్రద్ధ చేయకూడదు
 గుండెజబ్బులను ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఛాతీలో నొప్పి అనిపించిన వెంటనే గుండె వైద్యులను సంప్రదించాలి. జీజీహెచ్‌లో గుండె వైద్య సేవలన్నీ ఉచితంగా లభిస్తున్నాయి. సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు, పీజీ వైద్యులు, సీనియర్‌  కార్డియాలజిస్టులు  24 గంటలు విధుల్లోనే ఉండి సేవలందిస్తున్నారు.–డాక్టర్‌ కరోడి మురళీకృష్ణ,కార్డియాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

మరిన్ని వార్తలు