జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి

28 Jul, 2014 02:18 IST|Sakshi
జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
  •  లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల
  • కోనేరుసెంటర్ (మచిలీపట్నం) :  జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు ఇతర ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని బందరు ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లల్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను ఆది వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొనకళ్లతోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ రఘునందనరావు, ఎస్పీ ప్రభాకరరావు పాల్గొన్నారు.

    మంత్రి రవీంద్ర కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. కొనకళ్ల మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు తనను సంప్రదించిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేశానన్నారు. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసేం దుకు కృషి చేస్తానన్నారు.

    మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో సీసీ కెమేరాల ఏర్పాటు అభినందనీయమన్నారు. అయితే గతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయన్నారు. వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చేలా ఉన్నతాధికారులు కృషి చేస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించేలా విధులు నిర్వర్తించాలన్నారు.

    పట్టణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను అవసరమైన మేరకు తాము వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ట్రాఫిక్ నియంత్రణ సులభమవుతుందన్నారు. నేరాలు నియంత్రిం చేందుకు దోహదపడుతుందన్నారు. నేరస్థులపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలోని జగ్గయ్యపేట, పామర్రు పట్టణాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు.

    వీటితో పాటు మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లయిన మూడు స్తంభాలసెంటర్, కోనేరుసెంటర్, బస్‌స్టాండ్‌సెంటర్, ప్రభుత్వాస్పత్రి, చేపల మార్కెట్, రైతు బజార్, కాలేఖాన్‌పేటతో మరో 32 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన కొనకళ్లకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపల్ కమిషనర్ మోటమర్రి బాబా ప్రసాద్, అడిషనల్ ఎస్పీ బి.డి.వి.సాగర్, బందరు డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు, పట్టణ ప్రముఖలు, జనమైత్రి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు