ఆరోజు.. మీతో బాబు ఏమన్నారు?

17 Apr, 2019 04:21 IST|Sakshi
ద్వివేదిపై సీరియస్‌ అవుతున్న చంద్రబాబు (ఫైల్‌)

పోలింగ్‌ రోజు సీఎం వ్యాఖ్యలను తర్జుమా చేసి పంపండి

ద్వివేదికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

అభివృద్ధి చూసి ఓటెయ్యాలన్నబాబు వ్యాఖ్యలపైనా ఈసీ పరిశీలన

‘పోలింగ్‌ రోజు సీఎం చంద్రబాబునాయుడు మీ కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నారు? ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారు...? అవన్నీ మాకు వివరంగా నివేదిక రూపంలో అందచేయండి..’
– రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ ఆదేశం

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు అక్కడ మాట్లాడిన ప్రతి మాటను తర్జుమా చేసి అందుకు సంబంధించిన వీడియో, వాయిస్‌ రికార్డులను తమకు పంపాలని ఈసీ ఆదేశించడం ఉన్నతస్థాయిలో చర్చకు దారి తీసింది. పోలింగ్‌ సమయంలో సీఎం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లడంతో పాటు అక్కడ నిరసన వ్యక్తం చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించడంపై టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  

ద్వివేది కార్యాలయంలో బాబు నిరసన..
ఎన్నికల విధుల నుంచి పునేఠ, ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం, ప్రకాశం ఎస్పీలను సీఈసీ దూరం పెట్టడంతో చంద్రబాబులో అసహనం తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు, పలు ఆరోపణలు చేయడంతోపాటు పోలింగ్‌ జరిగిన ఏప్రిల్‌ 11వతేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఘాటైన వాఖ్యలుచేసి నిరసన కూడా తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి దృశ్యాలను వీడియో రికార్డింగ్‌  చేయవద్దని చంద్రబాబు ఆదేశించారు. ఆ రోజు ఏం జరిగిందనే సమాచారాన్ని ద్వివేది తక్షణం పంపినప్పటికీ ఆధారసహితంగా అన్ని వివరాలు జోడించి పంపాలని ఈసీ కోరింది. టీడీపీ ఫిర్యాదులు, వాటి వాస్తవ స్థితిని కూడా తెలియజేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ రోజు సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఓటుహక్కు ఉదయమే వినియోగించుకున్నా సాయంత్రం వరకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీ దృష్టికి తీసుకెళ్లింది. పోలింగ్‌ కేంద్రానికి సకాలంలో చేరుకున్న ప్రతి ఓటరుకు అవకాశం కల్పించామని తెలిపింది.

పోలింగ్‌ రోజు ఓటర్లను ప్రభావితం చేసేలా సీఎం వ్యాఖ్యలు
ఈవీఎంల పనితీరుపై అనుమానాలతో పాటు సీఈసీ శైలిపై దేశవ్యాప్తంగా చర్చించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం కూడా అదే స్థాయిలో స్పందించినట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. పోలింగ్‌ జరుగుతున్న రోజు ఓటర్లను ప్రభావితం చేసేలా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను కూడా ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించడంతో పాటు అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని పిలుపునివ్వడంపై ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

ఇక్కడ 696.... అక్కడ 334
రాష్ట్రంలో 696 ఈవీఎంలు పనిచేయడం లేదని ద్వివేదికి ఫిర్యాదుచేసిన టీడీపీ ఈసీకి ఆ సంఖ్యను 334గా పేర్కొంది. అన్నిటినీ సరిచేశామని, కొన్నిచోట్ల మాత్రం కొంత ఆలస్యం జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనట్లు తెలిసింది. పోలింగ్‌ ఏజెంట్లు సమయానికి రాకపోవడం, మాక్‌ పోలింగ్‌లో జాప్యం జరగడం, తొలిసారి వీవీ ప్యాట్‌ల వినియోగం వల్ల స్వల్ప సమస్యలు తలెత్తినా వెంటనే అన్నీ సర్దుకున్నాయని వివరించింది. ఎన్నికలకు ప్రభుత్వ సిబ్బందిని కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులను ఎంపిక చేయడాన్ని ఈసీ తప్పుబట్టింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు