నేడు చలో హాయ్‌ల్యాండ్‌

21 Nov, 2018 04:37 IST|Sakshi

     డిపాజిటర్లకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ముట్టడికి బాధితులు సిద్ధం

     తమను అడ్డుకోవద్దని పోలీసులకు వినతి

     పలుచోట్ల సంక్షేమ సంఘం, సీపీఐ నేతల అరెస్టులు, గృహ నిర్బంధం

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో అమీతుమీకి బాధితులు సిద్ధమయ్యారు. అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బుధవారం ‘ఛలో హాయ్‌ల్యాండ్‌’ పేరుతో ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్లేట్‌ ఫిరాయించిన అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హాయ్‌ల్యాండ్‌ తమదేనంటూ మంగళవారం హడావుడిగా ప్రకటన చేసింది. అయితే తమ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని అగ్రిగోల్డ్‌ బాధితులు స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు యాజమాన్యానికి మామూలేనని పేర్కొంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం సిద్ధమైందని, కోర్టు చీవాట్లు పెట్టినందువల్లే ప్లేట్‌ ఫిరాయించారని పేర్కొంటున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్‌ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని, శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

పోలీసు అనుమతికి దరఖాస్తు..
ఛలో హాయ్‌ల్యాండ్‌ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పోలీసుశాఖకు సోమవారమే దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి లేదనే సాకుతో పోలీసులు తమపై విరుచుకుపడితే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంక్షేమం సంఘం హెచ్చరించింది. తమకు రావాల్సిన న్యాయమైన డిపాజిట్ల కోసం ‘ఛలో హాయ్‌ల్యాండ్‌’ నిర్వహించడం తప్పా? అని సంఘం ప్రశ్నించింది. 

అక్రమ అరెస్టులకు ఖండన...
ఛలో హాయ్‌ల్యాండ్‌ నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేయడంతోపాటు గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. గుంటూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను, అసోసియేషన్‌ నాయకులు కోట మాల్యాద్రి, ఉపవలపూడి రాము, బుదాల శ్రీనివాస్, వెంకట్రావ్, బొర్రా మల్లిఖార్జునరావు, చిన్న తిరుపతయ్య, హరినాధ్‌ తదితరులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్‌ చేయటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నాలుగున్నరేళ్లుగా న్యాయం కోసం పోరాడిన బాధితులు గత్యంతరం లేక పోరాటానికి దిగితే అరెస్టులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రెండు బృందాలుగా ముట్టడి..
– అగ్రిగోల్డ్‌ బాధితులు నేడు చినకాకాని నుంచి ‘ఛలో హాయ్‌ల్యాండ్‌’ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి ముట్టడిస్తారు. 
– విజయవాడ కనకదుర్గ వారధి వైపు ఒక బృందం, మంగళగిరి శివార్ల నుంచి మరో బృందం హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటుంది.  

మరిన్ని వార్తలు