మళ్లీ కాపీ కొట్టాడు

28 Jan, 2019 02:39 IST|Sakshi

జగన్‌ హామీలను వరుసగా కాపీ కొడుతున్న చంద్రబాబు  

ఎన్నికల సమయంలో ఇవి అమలు కావని తెలిసినా జంకని వైనం

మొన్న పింఛన్లు, నిన్న రైతు భరోసా, నేడు కులాల కార్పొరేషన్లు

ప్రతి కులానికీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని ఇదివరకే హామీ ఇచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

బీసీల సానుభూతికి ఇదే హామీని వల్లె వేసిన సీఎం

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇదివరకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్నికల వేళ వరుసగా కాపీ కొడుతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన బీసీ సదస్సులో ఆయా కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రతి కులానికీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని వైఎస్‌ జగన్‌ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చేరుస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఆ మాట నిలుపుకోలేదు. కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా ప్రస్తుతం ఉన్న 11 బీసీ ఫెడరేషన్‌లను కార్పొరేషన్‌లుగా చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే విషయాన్ని వైఎస్‌ జగన్‌ చాలా సభల్లో పలు మార్లు చెప్పారు. పైగా ఆయా కులాలకు   జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. శెట్టిబలిజ, ఈడిగ, గౌడ, శ్రీసైన, యాదవ, కురుబ, మత్స్యకార, అగ్నికుల క్షత్రియ, వన్యకుల క్షత్రియ, తూర్పుకాపు, కొప్పుల వెలమ, కళింగ, గవర, గాండ్ల, చేనేత, తదితర కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వర్గాల వారు సమస్యలు వివరిస్తూ పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు వినతి పత్రాలు సమర్పించడంతో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కార్పొరేషన్‌ల ఏర్పాటుకు హామీ ఇవ్వడం తెలిసిందే. 

బీసీ సబ్‌ ప్లాన్‌ పేరుతో మళ్లీ మోసం చేసే ప్రకటన
నాలుగేళ్లుగా ఏటా రూ.10 వేల కోట్లు బీసీ సబ్‌ ప్లాన్‌ కింద బడ్జెట్‌లో కేటాయించామని చంద్రబాబు బీసీలను మోసం చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు ఇంత వరకు విధి విధానాలు లేకుండా బడ్జెట్‌లో నిధులు ఎలా కేటాయించారనే దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పడం లేదు. కేవలం బీసీ జనాభా ఉన్న ప్రాంతాల్లో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం చేసిన ఖర్చును బీసీ సబ్‌ప్లాన్‌ కింద ఖర్చు చేసినట్లు చూపించి మోసం చేశారు.

ఈ నేపథ్యంలో బీసీ సబ్‌ప్లాన్‌ విధి విధానాల రూప కల్పనకు కమిటీ వేస్తామని తాజాగా సదస్సులో ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు సబ్‌ప్లాన్‌ అంటూ మోసం చేసిన విషయాన్ని ఆయన అంగీకరించినట్లేనని పలువురు బీసీ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. అత్యంత వెనుకబడిన కులాలకు కార్పొరేషన్‌ తానే ఏర్పాటు చేసినట్లు సభలో గొప్పలు చెప్పుకున్నారు. నిజానికి దివంగత సీఎం వైఎస్సార్‌ నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విధి విధానాలకు రూపకల్పన జరిగింది. అప్పట్లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ ఈ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. ఆ తర్వాత కార్పొరేషన్‌ ఏర్పాటైంది.

అన్నీ జగన్‌ చెప్పినవే.. 
పెన్షన్‌లు రెట్టింపు చేశానని, ట్రాక్టర్లు, ఆటోలకు ట్యాక్స్‌ ఎత్తి వేశానని, నాయీ బ్రాహ్మణులకు తాను తప్ప ఎవ్వరూ సాయం చేయలేదని చంద్రబాబు సభలో చెప్పుకున్నారు. బీసీలకు ఆదరణ గురించి చెబుతూ 4 లక్షల మందికి వస్తువులు అందించినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆదరణ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్న వారు 7.53 లక్షల మంది ఉంటే అందులో డిపాజిట్‌ కట్టిన వారు 3.44 లక్షల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో కనీసం రెండు లక్షల మందికి కూడా పూర్తి స్థాయిలో వస్తువులు ఇవ్వలేదు. పైగా ఇచ్చిన వస్తువులన్నీ నాసిరకం. అయినా చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం చూసి సభకు వచ్చిన పలువురు ఆశ్చర్యపోయారు. సభ జరుగుతున్న సమయంలో పలుమార్లు ‘తమ్ముళ్లూ చప్పట్లు కొట్టండి’ అంటూ కోరినా పెద్దగా స్పందన రాలేదు.

నాయీ బ్రాహ్మణులు ఇటీవల సచివాలయం వద్దకు వచ్చి సమస్యలు విన్నవిస్తే చంద్రబాబు తీవ్రంగా మండిపడిన విషయం ఎవరూ మరచి పోలేదు. ‘నన్నే ప్రశ్నిస్తారా.. మీ తోకలు కట్‌ చేస్తా’నని బెదిరించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రకటించినవన్నీ ఇదివరకే జగన్‌ ఇచ్చిన హామీలే. ఆటో వాలాలు జగన్‌ను కలిసి సమస్యలు వివరించినప్పుడు ట్యాక్స్‌ తీసి వేయడంతో పాటు సంవత్సరానికి రూ.10 వేలు ఉచితంగా సాయం అందిస్తానని ప్రకటించారు. అవ్వాతాతలకు తోడుగా ఉంటానని చెబుతూ పెన్షన్‌ను రూ. రెండు వేలు చేస్తానని, రైతుల ట్రాక్టర్లకు ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు అనేకసార్లు చెప్పారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు ఉచితంగా ఇస్తానని, డ్వాక్రా మహిళల రుణాల మొత్తాన్ని నాలుగు విడతలుగా వారి చేతికే ఇస్తానని కూడా జగన్‌ నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు