బీసీలకు కులాలవారీగా కార్పొరేషన్లు

28 Jan, 2019 02:47 IST|Sakshi

రాజమహేంద్రవరం ‘జయహో బీసీ’ సభలో సీఎం చంద్రబాబు

బీసీలంతా నా వెనుకే ఉన్నారు.. మాతో పెట్టుకుంటే ఖబడ్దార్‌

బీసీల విదేశీ విద్యకు రూ.15 లక్షల దాకా ఇస్తాం  

రాజధానిలోని 10 ఎకరాల్లో జ్యోతిరావ్‌పూలే స్మారక భవనం 

అత్యంత వెనుకబడిన బీసీలకు సబ్సిడీ రూ.50 వేలకు పెంచుతాం   

రూ.3 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వెనుకబడిన తరగతులకు(బీసీ) కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీయేనని చెప్పారు. నేతలు కొంతమంది అటూ ఇటూ అయినా వెనుకబడిన కులాలన్నీ టీడీపీ వైపే ఉన్నాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన జయహో బీసీ సభలో చంద్రబాబు మాట్లాడారు. 8 మంది బీసీ మంత్రులు తన ప్రభుత్వంలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఇంతమంది బీసీ మంత్రులు ఉన్నారా? అని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు నియమించిన న్యాయమూర్తుల విషయంలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరామని స్పష్టం చేశారు. ఆదరణ పథకం కింద రూ.950 కోట్లు ఖర్చు పెట్టి 4 లక్షల మందికి ఆధునిక పనిముట్లు ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీయేనని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక రూ.111 కోట్ల మేర నేతన్నలకు రుణమాఫీ చేశామన్నారు. బీసీలంతా తన వెనుకే ఉన్నారని, మాతో పెట్టుకుంటే ఖబడ్దార్‌ అని బీజేపీ, వైఎస్సార్‌సీపీని హెచ్చరిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, కళా వెంకట్రావు, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. 

బీసీలపై బాబు హామీల వర్షం 
‘‘మన వద్ద ఫెడరేషన్‌లు ఉన్నాయి. ఫెడరేషన్‌ కాకుండా కార్పొరేషన్లు పెట్టండని బీసీలు అడిగారు. అందుకే బీసీ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, కృష్ణబలిజ, సగర, ఉప్పర, పూసల, వాల్మీకి, బోయ, భట్రాజు, కుమ్మరి కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తాం. శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, శ్రీశయన వారికి కూడా ప్రత్యేక కార్పొరేషన్‌లు నెలకొల్పుతాం. విశ్వబ్రాహ్మణ, మేదర, వడ్డెర కార్పొరేషన్‌లకు శ్రీకారం చుడతాం. మత్స్యకారులకు, అగ్నికుల క్షత్రియులకు, యాదవులకు, కురబలకు ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తాం. గొర్రెలకు ఇన్సూరెన్స్‌ అమలు చేయడమేకాకుండా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అగ్నికుల క్షత్రియులను ఎస్సీల్లో చేర్చడానికి కమిషన్‌ వేశాం, త్వరలోనే దాని నివేదిక వస్తుంది. తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం. తూర్పుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ పెట్టి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తాం. కొప్పుల వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్‌ తీసుకొస్తాం. మేత, పద్మశాలి వంటి అనేక వర్గాల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. కాళింగ, గవర, దాడ్లకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఇవేకాకుండా రూ.3 వేల కోట్లతో మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలకు ఆయన ప్రకటించిన హామీల్లో మరికొన్ని ఏమిటంటే.. 

- విదేశీ విద్యకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తాం. 
- చేనేత కార్మికులకు 100 యూనిట్ల నుంచి 150 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తాం.
- నాయీబ్రాహ్మణుల దుకాణాలకు 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తాం. 
- వాల్మీకి బోయలను ఎస్టీల్లోకి చేర్చేందుకు చర్యలు.
- రజకులను ఎస్సీల్లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం.  
- రాజధానిలోని 10ఎకరాల్లో  జ్యోతిరావ్‌పూలే స్మారక భవనం, ఉద్యానవనం నిర్మిస్తాం. దానికోసం రూ.100 కోట్లు కేటాయిస్తాం.   
- అత్యంత వెనుకబడిన బీసీలకు సబ్సిడీని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతాం.  
- సంచార జాతులకు 100 యూనిట్లు విద్యుత్‌ ఉచితం.
- బీసీలు కార్లు కొనుక్కుంటే 25 శాతం సబ్సిడీ ఇస్తాం. 
- బీసీలకు69 రెసిడెన్షియల్‌ పాఠశాలలు పెడతాం, నియోజకవర్గానికొక గురుకుల పాఠశాల ఉండేలా చూస్తాం.  
- స్వర్ణకారులకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తాం

సీఎం ప్రసంగం.. కుర్చీలు ఖాళీ 
జయహో బీసీ సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జనం లేక ఖాళీగా కనిపిస్తున్న కుర్చీలు  

జయహో బీసీ సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుందని టీడీపీ నేతలు చెప్పారు. 3 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కానీ, అందులో 20 శాతం మంది కూడా రాలేదు. వచ్చిన వారిలో కూడా బీసీలే కాకుండా మిగతా సామాజిక వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు 4.36 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అంతవరకు వేచి చూడలేక జనం తిరుగుముఖం పట్టారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభించాక కుర్చీలు ఖాళీ అయిపోయాయి. కాగా,బీసీ  సభకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జనాలను తరలించారు. బస్సు తిరిగి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు వచ్చేసరికి గడ్డర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో అన్నవరప్పాడుకు చెందిన మద్దూరి శివ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. 

మరిన్ని వార్తలు