లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం

30 Jan, 2019 04:38 IST|Sakshi

వేమూరి రాధాకృష్ణతో కలిసి వచ్చిన లగడపాటి 

అర్ధరాత్రి రెండు గంటలకుపైగా మంతనాలు

సాక్షి, అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో కలిసి సోమవారం రాత్రి రాజగోపాల్‌ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. రాత్రి 10.30 నుంచి 12 వరకూ చంద్రబాబు వారిద్దరితో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు చంద్రబాబును కలిసేందుకు వేచి చూస్తున్నారు. చంద్రబాబు వారిని అలాగే కూర్చోబెట్టి రాజగోపాల్, రాధాకృష్ణతో సుదీర్ఘంగా మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి తాను చేసిన సర్వేలో చంద్రబాబుకు అనుకూలంగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే.

చంద్రబాబు సూచనల ప్రకారం మహాకూటమికి అనుకూలంగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు లగడపాటి శతవిధాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, ఫలితాలు లగడపాటి సర్వేకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు ఏపీలోనూ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లగడపాటిని చంద్రబాబు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే అర్ధరాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని.. వాటితో ప్రజల అభిప్రాయాన్ని మార్చడం, లేకపోతే గందరగోళపరచడం కోసం లగడపాటిని ఉపయోగించుకునేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తరచూ లగడపాటిని చంద్రబాబు కలుస్తున్నారు. 

మరిన్ని వార్తలు