ఉగ్రపంజాకు రాలిన స్వాతిముత్యం

2 May, 2014 00:39 IST|Sakshi
ఉగ్రపంజాకు రాలిన స్వాతిముత్యం

 గుంటూరు రూరల్, న్యూస్‌లై న్ :‘అమ్మా ఇప్పుడే చెన్నై స్టేషన్‌లోకి వచ్చా... ప్లాట్‌ఫాం నంబర్ నైన్‌లో ఉన్నా,  ఇప్పుడే బోగిలోకి ఎక్కుతున్నాను. కాసేపట్లో ఇంటికి చేరుకుంటానంటూ’ తల్లితో మాట్లాడిన స్వాతి కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు పేలుతాయన్న పది నిమిషాల ముందు వరకు అమ్మతో మాట్లాడిన స్వాతి అంతలోనే మృత్యుఒడిలో చేరింది. ఉన్నత చదువు..ఉన్నత ఉద్యోగం.. భవిష్యత్తుపై కోటి ఆశలు.. ఇంకా కొన్ని గంటలు ప్రయాణం చేస్తే సొంతింటికి వెళ్లి తల్లిదండ్రులతో గడపవచ్చని ఆశగా బయలుదేరిన స్వాతిని మృత్యువు నీడలా వెంటాడింది.
 
 గురువారం తెల్లవారుజామున చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలుళ్లలో గుంటూరుకు చెందిన పరుచూరి స్వాతి (22) దుర్మర ణం పాలయింది. ఈ విషాద వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యు లు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడికి చెం దిన పరుచూరి రామకృష్ణ వ్యవసాయం చేస్తుంటారు. ఆయన భార్య కామాక్షి పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలు. కొంతకాలంగా గుంటూరు శ్రీనగర్ ఏడో లైన్‌లో నివాసం ఉంటున్నా రు. వీరికి కుమార్తె స్వాతి, కుమారుడు ప్రద్యుమ్న. కుమారుడు ముంబయి ఐఐటీలో చదువుతున్నాడు. స్వాతి ప్రాథమిక విద్య కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్, ఇంటర్‌మీడియెట్ సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలోనూ, బీటెక్ త్రివేండ్రంలో, ఎంటెక్ జేఎన్‌టీయూలో చదివింది.
 
 క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై జనవరిలో బెంగళూరు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా చేరింది. అదే నెల చివరలో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి తిరిగి బెంగళూరు వెళ్లింది. వేసవిలో ఏడురోజులు సెలవులు రావడంతో స్వాతి బెంగళూరు నుంచి వయా చెన్నై మీదుగా విజయవాడకు తత్కాల్‌లో టికెట్ తీసుకుంది. ఇంటికి వస్తున్నానంటూ బుధవారం రాత్రి తల్లిదండ్రులకు స్వాతి సంతోషంగా చెప్పింది. బెంగళూరు నుంచి గురువారం తెల్లవారుజామున చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడే నిలిచి ఉన్న గౌహతి ఎక్సైప్రెస్‌లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపారు. ఈ దుర్వా ర్త తెలుసుకున్న స్వాతి కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైకు బయలుదేరారు. వారు మార్గంమధ్యలో ఉండగా.. గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్-5, సీటు నంబర్-9లో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన పరుచూరి స్వాతి బాంబు పేలుళ్లకు మృతి చెందినట్లు సమాచారం వచ్చింది.
 
 దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు లోనయ్యారు. ఇంటి వద్ద ఉన్న స్వాతి అమ్మమ్మ రాజ్యలక్ష్మి, తాతయ్య సత్యనారాయణలు మనవరాలి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందారు. తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని భోరున విలపించారు. చిరునవ్వుతో పలకరించే స్వాతి ఆకస్మికంగా మృతిచెందడం స్థానికులను కలచివేసింది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు మంచి ఉద్యోగం లభించిందన్న సంతోషంతో ఉన్న తల్లిదండ్రుల్లో విషాదం అలుముకుంది. చెన్నయ్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వాతి మృతదేహాన్ని గుంటూరు తీసుకురానున్నట్లు సమాచారం.
 

>
మరిన్ని వార్తలు