మరింత సాయం కోసం...

10 Feb, 2020 13:04 IST|Sakshi
పెదబుడ్డిడిలో బాధిత కుటుంబ సభ్యులకు చెక్‌ను అందజేస్తున్న దాతలు

 ఎదురు చూపులు

ఇప్పటికే రూ.4లక్షలు సమకూర్చిన దాతలు

రూ.మరో 3 లక్షలు అవసరమని చెబుతున్న బాధిత కుటుంబ సభ్యులు  

జియ్యమ్మవలస: అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారి తల్లి చికిత్సకు అవసరమైన సాయం కొంత మొత్తం ఇప్పటికే అందింది. కానీ ఆ మొత్తం సరిపోదని మరింత మొత్తం అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీను, స్వాతి భోగాపురం సమీపంలోని కోళ్ల ఫారంలో పని చేస్తూ అక్కడే నివాసం ఉండేవారు. తమ 11 నెలల బాబు తన్వీర్‌కు అనారోగ్యం చేయడంతో గత నెల 31న బైక్‌పై విశాఖపట్నం ఆస్పత్రికి బైక్‌పై బయలుదేరి భోగాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై  శ్రీను(34) అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  స్వాతిని విశాఖపట్నం అపోలో ఆస్పత్రికి తరలించగా ఇప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్సలు చేశారు. స్వాతి చికిత్సకు సుమారు రూ.ఏడు లక్షలు ఖర్చవుతుందని అపోలో వైద్యులు తెలిపారు.  బాధితురాలి గ్రామానికి చెందిన యువత సామాజిక మాధ్యమాల్లో చిన్నారి తల్లి చికిత్సకు సాయం అందించాలని దాతలను కోరారు. 

స్పందించిన దాతలు...
సామాజిక మాధ్యమాల్లో స్వాతి  పరిస్థితి చూసి చలించిన గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన నౌడు నాగరాజు(డీఏఓ, ధవళేశ్వరం) తన సహోద్యోగులు, స్నేహితులు, గ్రామస్తుల సహకారంతో రూ.లక్షా 40వేల 712లను విరాళాలను సేకరించారు. ఈ మొత్తాన్ని ఆయన కుటుంబ సభ్యులు గంట వెంకటనాయుడు, ముసలినాయుడు చేతుల మీదుగా స్వాతి తల్లిదండ్రులు రేవళ్ల సీతారాం, పద్మలకు అందజేశారు. పెదబుడ్డిడికి చెందిన కర్రి శ్రీనివాసరావు, రేవళ్ల శంకరరావు, మంతిని శ్రీను, తలచింతల తవిటిరాజు, కోట్ని రవి తదితరులు గ్రామస్తుల సహకారంతో సుమారు రూ.లక్షా 90వేలు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. పలువురు దాతలు సుమారు రూ.70వేలు వితరణగా అందించారు. ఇప్పటి వరకు సుమారు రూ.4లక్షలు సమకూరింది. తమ కుమార్తె చికిత్సకు మరో రూ.3లక్షలు అవసరమవుతుందని తల్లిదండ్రులు వెల్లడించారు. రెక్కాడితేగాని పొట్ట నిండని తమ కుటుంబానికి దాతలు సాయం చేసి ఆదుకోవాలని దాతలు అకౌంట్‌ నంబరు 139600101008629, ఐఎఫ్‌ఎస్‌సీ : సీఓఆర్‌పీ 0001396, ఫోన్‌ పే నెంబరు 7893538534కు సాయం పంపాలని కోరారు.

మరిన్ని వార్తలు