తిరుమలలో ‘చిరు’ సందడి

12 Jul, 2015 02:41 IST|Sakshi
తిరుమలలో ‘చిరు’ సందడి

సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సందడి చేశారు. చాలా రోజుల తర్వాత తన సతీమణి సురేఖ, కుమార్తెలు సుష్మిత, శ్రీజ, పెద్దల్లుడు విష్ణుప్రసాద్, ముగ్గురు మనుమరాళ్లతో కలసి ఆయన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఆలయం వెలుపల చేయి చాచిన భక్తులు, అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. చిరంజీవిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు.
 
కొన్ని మధురం... మరికొన్ని చేదు

తిరుపతి, తిరుమలతో చిరంజీవికి ఎంతో అనుబంధం ఉంది. సినీనటుడుగా ఆయన ఎన్నోసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2008 ఆగస్టు 26వ తేదీన తిరుపతిలోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తన జీవితంలో మధుర జ్ఞాపకమని అప్పట్లోనే చిరంజీవి ప్రకటించారు. 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యే పాలకొల్లులో, తిరుపతిలో పోటీ చేశారు. పాలకొల్లులో ఓటమిపాలై,  తిరుపతిలో గెలుపొందారు. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని 2011, ఫిబ్రవరి 6న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది లక్షలాదిమంది అభిమానుల్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అతితక్కువ కాలంలోనే తన ఎమ్మెల్యే పదవికి  2012, మార్చి 29న రాజీనామా చేశారు.

తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా నియమితులై కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. తిరుపతిని సుందరంగా అభివృద్ధి చేస్తానని, తిరుమల స్థానికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీల వర్షం కురిపించారు. ఆ సందర్భంగా పలుమార్లు తిరుపతి నియోజకవర్గంలో తిరిగారు. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిచ్చాయి. చిరంజీవి  ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆయన హామీని నమ్మి తమ ఇళ్లు ఖాళీ చేసిన తిరుమల బాలాజీనగర్‌వాసులకు తిరిగి ఇళ్లు దక్కలేదు. మూడేళ్లుగా సత్రాల్లోనే జీవనం సాగిస్తూ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చాలా కాలం తర్వాత తిరుపతి, తిరుమలలో కాలుమోపిన చిరంజీవికి పాత జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. చిరంజీవిని కలిసేందుకు శనివారం బాలాజీనగర్ బాధితులు అతిథిగృహానికి వచ్చారు. అప్పటికే ఆయన తిరుగు ప్రయాణం కావడంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు