కనిగిరిలో సీఐడీ కలకలం

28 Jul, 2016 00:25 IST|Sakshi
కనిగిరి : తెలంగాణలో జరిగిన ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ విషయంలో సీఐడీ అధికారులు ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం లేపారు. పట్టణానికి చెందిన యువకుడు ఖాశింను సీఐడీ ఎస్సై, అధికారుల బృందం మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. లీకేజీ విషయంలో ప్రధాన నిందితులతో సంబంధం ఉన్న వలేటివారిపాలెం వాసి ఎస్‌కే రమేష్‌ను సీఐడీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 
రమేష్‌తో కనిగిరికి సంబంధం ఇదీ... 

ఎస్‌కే రమేష్‌ది కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం. ఇతను ప్రస్తుతం విశ్రాంత సైనికుడు. రమేష్‌ గత ఇరవై ఏళ్ల క్రితమే వలేటివారిపాలెం వదిలి వెళ్లాడు. హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు. ఒకరు డాక్టర్, మరొకరు నేవీ ఉద్యోగిగా తెలుస్తోంది. ఒక కుమార్తె ఉంది. రమేష్‌ భార్య చెల్లెలి కుమారుడు ఖాశిం. కనిగిరిలో అత్తగారిళ్లు ఉంది. దీంతో రమేష్‌ అప్పుడప్పుడు కనిగిరి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఎక్కువగా ఖాశింను కలుస్తుంటాడు. హైదరాబాద్‌ నుంచి స్కార్పియో కారులో కనిగిరి వచ్చి రెండుమూడు రోజుల్లో మకాం వేసి బంధువులతో కలిసి వెళ్తుంటాడు. రమేష్‌ ఎక్కువ సమయాన్ని  కందుకూరుకు చెందిన గ్రానైట్‌ వ్యాపారితో కలిసి ఉంటాడని సమాచారం. 

ఖాశింను ఎందుకు విచారించారంటే..!
రమేష్‌కు చెందిన ఫోన్‌కాల్‌ లిస్ట్‌లో ఎక్కువ సార్లు ఖాశిం నంబర్‌ ఉంది. ఇటీవల కనిగిరి వచ్చిన రమేష్‌..ఖాశిం ఫోన్‌తో తన అల్లుడికి కాల్‌ చే శాడు. దీంతో ఖాశింపై అనుమానం వచ్చిన సీఐడీ అధికారులు రెండు రోజులు కనిగిరిలో మకాం వేసి ఖాశిం ప్రవర్తనను గమనించి మంగళవారం సాయంత్రం ఏటీఎం వద్ద అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ తరచూ కనిగిరిలో బస చేసే కందుకూరు గ్రానైట్‌ వ్యాపారికి చెందిన కనిగిరి గెస్ట్‌ హౌస్‌ను కూడా సీఐడీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది. 

ఒంగోలులోనే వదిలేశారు : ఖాశిం  
సీఐడీ అధికారులు తనను విచారించి ఒంగోలులోనే వదిలేసినట్లు ఖాశిం విలేకర్లకు తెలిపారు. వరుసకు బాబాయి అయిన రమేష్‌ను తెల్లవారుజామున సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాడు. తనకు, రమేష్‌కు ఎటువంటి  సంబంధం లేదన్నాడు.
 
మరిన్ని వార్తలు