మహా లక్ష్యం నీరుగారె.. | Sakshi
Sakshi News home page

మహా లక్ష్యం నీరుగారె..

Published Wed, Jul 27 2016 11:52 PM

అటకెక్కిన చెత్త డబ్బాలు - Sakshi

► ఫలితమివ్వని సంస్కరణలు
► మెరుగుపడని పారిశుద్ధ్యం
► ‘దారి’ మళ్లిన రంగు డబ్బాల పథకం
► వేతనాలు, సిబ్బంది పెరిగినా ఫలితం శూన్యం

► కోట్లు ఖర్చు చేసినా బాగుపడని నగరం

సాక్షి, సిటీబ్యూరో: మహానరగాన్ని మెరిపించేందుకు కొంగొత్త సంస్కరణలు అమలు చేశారు. అందుకు కోట్లు ఖర్చుపెట్టారు. సిటీని చెత్త రహితంగా మారుస్తామని నేతలతో కలిసి గ్రేటర్‌ అధికారులు ప్రమాణం చేశారు. రెండు రంగుల చెత్త డబ్బాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఉండేందుకు చెత్త తరలింపు కోసం దాదాపు 2 వేల చెత్త తరలింపు ఆటో ట్రక్కులను కొనుగోలు చేసి కార్మికులకు పంపిణీ చేశారు.

చెత్త నిల్వ ప్రాంతాలుగా ఉన్న 1,1116 ప్రదేశాలను పరిశుభ్రం చేసి, తిరిగి అక్కడ చెత్త వేయకుండా రంగవల్లులతో తీర్చిదిద్దారు. పారిశుధ్య కార్మికులకు గుర్తింపునిస్తూ ‘పరిచయం’ పేరిట స్థానిక ప్రజలకు తెలిసేలా చేశారు. ఓవైపు ఈ పనులు చేస్తూనే మరో వైపు కార్మికుల డిమాండ్ల కనుగుణంగా వారి వేతనాలనూ పెంచారు. ఏడాది గడిచింది. నగరంలో పారిశుధ్యం మెరుగుపడిందా..? అంటే మాత్రం ప్రజల నుంచి పెదవి విరుపే సమాధానమైంది. నగరంలో నిర్వహించిన ‘స్వచ్ఛ హైదరాబాద్‌’పై ‘సాక్షి’ ఫోకస్‌..



పక్కదారి పడుతున్న ఆటో టిప్పర్లు..
ఉన్నత లక్ష్యంతో చెత్త తరలించేందుకు జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపునకు దాదాపు 2 వేల ఆటో టిప్పర్లు కొనుగోలు చేసింది. వాటిని తీసుకున్న కార్మికులు వాహనాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆటో వాళ్లకు, ఎప్పటినుంచో పనిచేస్తున్న రిక్షా కార్మికులకు గొడవలు జరుగుతున్నాయి. అందుకు కారణం తమ ఉపాధి పోతుందని రిక్షా కార్మికులు వాదిస్తున్నారు. ఈ ఆటోలను సైతం ఆస్పత్రుల వంటి వాటి నుంచి చెత్త తరలించేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇళ్లనుంచి సేకరించే చెత్తతో వచ్చే ఆదాయం కంటే ఆస్పత్రుల వ్యర్థాలను తరలిస్తే అధిక మొత్తం వస్తుందని ఇక్కడకే వెళ్లేందుకు పోటీపడుతున్నారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ ఆటోలను వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేరు.

 

రంగు వెలసిన జంట డబ్బాలు..
రోడ్లపై చెత్త వేయకుండా ఇళ్ల నుంచి నేరుగా చెత్త ఆటోల ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలించాలనే తలంపుతో ఆటోట్రాలీలను కొన్నారు. ఇంటికి రెండు రంగుల చెత్త డబ్బాలను అందజేశారు. వాటిలో తడి, పొడి చెత్తను వేరుగా వేయాలన్నారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ 44.04 లక్షల డబ్బాలు పంపిణీ చేసింది. వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించలేకపోయారు. దాంతో ప్రజలు వీటిని ఇతర అవసరాలకు వాడుతున్నారు. దీంతో రూ. 42 కోట్లు ఖర్చు చేసినా వృథా ప్రయత్నమైంది.



వేతనం పెరిగినా మారని తీరు..
గత జూలైలో 11 రోజుల పాటు పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పారిశుధ్య కార్మికుల వేతనం రూ. 8500 నుంచి రూ. 12,500కు పెరిగింది. డ్రైవర్లకు రూ. 10,200 నుంచి రూ. 15 వేలు చేశారు. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 24,446 మంది కార్మికులు లబ్ధి పొందారు. ఇందులో 948 మంది ఎస్‌ఎఫ్‌ఏలు, 975 మంది డ్రైవర్లు, 1537 మంది రవాణా విభాగంలోని కార్మికులు ఉన్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీపై దాదాపు రూ. 200 కోట్ల భారం పడింది. ఏడాది గడిచింది.. పారిశుధ్య కార్యక్రమాలు మాత్రం మెరుగుపడలేదని నగర ప్రజలు భావిస్తున్నారు.



‘పరిచయం’ బాగున్నా..
గ్రేటర్‌లోని వివిధ విభాగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి. జనార్దన్‌రెడ్డి ‘పరిచయం’ పేరిట విధుల్లోని కార్మికులపేర్లను ఆయా వీధుల్లోని గోడలపై రాయించారు. అయినా చాలా చోట్ల నాలుగైదు పేర్లే ఉంటాయి తప్ప ఏడుగురివీ ఉండవు. అంటే వాస్తవంగా పనిచేస్తున్నది నలుగురైదుగురేనన్న మాట.



ఏదీ స్వచ్ఛ స్ఫూర్తి..!
గత ఏడాది ‘స్వచ్ఛ హైదరాబాద్‌’లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. పేరుకున్న చెత్తకుప్పలను తొలగించేందుకు వీలైనన్ని అదనపు వాహనాలు, సిబ్బందిని వినియోగించారు. ఆ పనుల కోసం దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో కాలనీని ఒక్కో వీఐపీ దత్తత తీసుకున్నారు. ఒకటిరెండు సమావేశాలు నిర్వహించారు. అనంతరం విస్మరించి లక్ష్యాన్ని నీరుగార్చారు.



ఆగని అవినీతి..
సమ్మె కారణంగా అప్పట్లో తొలగించిన దాదాపు 1300 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు డబ్బులు చేతులు మారాయి. పనిలో పనిగా తీసివేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు లక్షలు తీసుకున్నట్టు ఆరోపణులున్నాయి. కాగితాల్లో తప్ప  క్షేత్రస్థాయిలో కార్మికులు లేకపోవడం విచారణలో వెలుగు చూసింది. ఇలాంటి కారణాలతో ఇద్దరు  ఏఎంఓహెచ్‌లను మాతృ సంస్థలకు సరెండర్‌ చేశారు. మరికొందరిని సస్పెండ్‌ చేశారు.

Advertisement
Advertisement