మద్య నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు

28 Aug, 2019 14:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర రెవెన్యూపై వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులెలా ఉన్నాయో విభాగాల వారీగా ఆయా శాఖల అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. అనంతరం సీఎం జగన్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

‘మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలి. స్మగ్లింగ్‌ జరగకుండా..  నాటు సారా తయారీ కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్యప్రణాళికలో చేర్చాలి. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణనివ్వాలి. మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుల సేవల్ని వినియోగించుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదు’అన్నారు.

రాష్ట్రంలో పరిస్థితులిలా..
అంతకు ముందు ఆయా శాఖల అధికారులు సీఎం దృష్టికి పలు అంశాలు తీసుకొచ్చారు. వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధిలేదని తెలిపారు. స్టీల్, ఇనుము, సిమెంటు రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోందని అన్నారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని పేర్కొన్నారు. కాని, ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల (సెప్టెంబర్‌) మొదటివారంలో రూ.597 కోట్లు ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుందని అన్నారు.

లిక్కర్‌ వినియోగం గణనీయంగా తగ్గిందని చెప్పారు. 2018–2019లో 125 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు జరగగా..  బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గిందని చెప్పారు. ప్రైవేటు మద్యం దుకాణాలు తొలగింపునకు రంగం సిద్ధమైందని తెలిపారు. దుకాణాల సంఖ్య 4380 నుంచి 3500 తగ్గిస్తున్నామన్నారు. మద్యనియంత్రణ, నిషేధానికి, డీఎడిక్షన్‌ సెంటర్లకు రూ.500 కోట్లు పెంచుతున్నామన్నారు.

>
మరిన్ని వార్తలు