రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి : సీఎం జగన్‌

16 Nov, 2019 03:19 IST|Sakshi
శుక్రవారం ఎంపీలతో భేటీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

18 నుంచి పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్‌ దిశా నిర్దేశం

మన బలాన్ని పూర్తిగా ప్రజల కోసమే వినియోగిద్దాం

రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పట్టుబట్టండి

విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ నెరవేర్చాలని కోరదాం

పోలవరం మిగతా నిధుల కోసం కృషి చేయాలి

గోదావరి–కృష్ణా అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి

ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి
తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. లోక్‌సభలో వైఎస్సార్‌ సీపీ నాలుగో పెద్ద పార్టీ  అని గుర్తు చేస్తూ మన బలాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలని ఎంపీలను కోరారు. పోలవరం సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల కోసం కృషి చేయాలని, విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చేలా కేంద్రాన్ని గట్టిగా కోరాలని సూచించారు.  ఈనెల 18వతేదీ నుంచి జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. 

ప్రణాళికా లోపంతో జాప్యం..
పోలవరంపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11,800 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం రూ 8,577 కోట్లు విడుదల చేసిందని, గత వారం రూ 1,850 కోట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,222 కోట్లు రావాల్సి ఉందన్నారు. సవరించిన అంచనాల ప్రకారం రూ.55,549.87 కోట్లకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులు సరైన ప్రణాళిక లేకుండా చేయడంతో నాలుగు నెలలుగా చేపట్టలేకపోయామన్నారు. వచ్చే జూన్‌ నాటికి కాఫర్‌డ్యాం పూర్తయితే 41.5 మీటర్ల మేరకు నీరు నిల్వ ఉంటుందని దీనివల్ల ముంపునకు గురయ్యే గ్రామాల పునరావాస, సహాయక చర్యల (ఆర్‌ అండ్‌ ఆర్‌) కోసం రూ 10,000 కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విభజన నాటికి కాగ్‌ లెక్కల ప్రకారం రూ 22,948.76 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్లు తేలగా ఇప్పటివరకూ రూ 3,979 కోట్లు ఇచ్చారని మిగిలిన రూ 18,969 కోట్ల విడుదల కోసం కృషి చేయాలన్నారు. 

మనకూ 7 మెడికల్‌ కాలేజీలివ్వాలి
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాలకు రూ.7,530 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేంద్రం రూ.1,050 కోట్లు ఇచ్చిందని మిగిలిన నిధుల విడుదలకు గట్టిగా ప్రయత్నించాలని సీఎం సూచించారు. ఉపాధి హామీ కింద రూ.2,246 కోట్ల నిధులు రావాలన్నారు. పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణ దూరాన్ని 3,285 నుంచి 6,135 కిలోమీటర్లకు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన విజ్ఞప్తిని పార్లమెంట్‌  సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే ఏపీకి కూడా 7 కొత్త మెడికల్‌ కళాశాలలను మంజూరు చేయాల్సిందిగా కోరాలని సూచించారు. గోదావరి–కృష్ణా అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేలా పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు 12 లక్షల ఇళ్లు కేటాయించి లబ్ధిదారుల ఎంపిక అర్హతలను సడలించాలని కోరాలన్నారు. 

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి..
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావిస్తూ అవినీతి రహిత పాలన, పథకాల అమలులో వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నా టీడీపీ నిరంతరం బురద జల్లుతూ దుషŠప్రచారం చేస్తోందని, దీన్ని బలంగా తిప్పి కొట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టినందుకు ఎంపీలంతా ముక్తకంఠంతో మద్దతు తెలుపుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశం వివరాలను లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీలు మార్గాని భరత్, డాక్టర్‌ సత్యవతి మీడియాకు వివరించారు. 

మరిన్ని వార్తలు