సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం జగన్‌ సమీక్ష

3 Feb, 2020 20:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: నిర్దేశిత సమయంలోగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలను పరిశీలించి తుది ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సహా ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. (రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్)

గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, రాయలసీమలో కరువు నివారణ కోసం చేపట్టాల్సిన కాల్వల విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై ముందుకెళ్లాలన్నారు. వీటిపై మరింత అధ్యయనం చేసి, అనుసరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, నిర్దేశిత సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు. (బాబు పాలనలో సీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం)
 
పోలవరం నుంచి విశాఖకు ప్రత్యేక పైప్‌లైన్‌పై కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని, పోలవరం, వెలిగొండ, చిత్రావతి, గండికోట ప్రాజెక్టులకు సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలవరం మినహా ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు రూ.25,698 కోట్లు, రాయలసీమ కరువు నివారణ పనుల కోసం రూ.33,8689 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం రూ.15,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.  (పెండింగ్ పాపం ఎవరిది?)

మరిన్ని వార్తలు