వ్యవసాయం ద్వారా జీవనోపాధి

16 Jun, 2020 03:26 IST|Sakshi
ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సమీక్షిస్తు్తన్న సీఎం వైఎస్‌ జగన్‌

గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌  

అధికారులు మానవత్వంతో ప్రతి ఒక్కరికీ మంచి చేయాలి 

మనం చేసే మంచిని గిరిజనులు కలకాలం గుర్తు పెట్టుకుంటారు 

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాను ఆధార్‌తో లింక్‌ చేయాలి 

అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదు  

ఆదివాసీ దినోత్సవం నాటికి అటవీ భూములపై హక్కులు కల్పించాలి 

సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్‌ఆర్‌ (రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) మంజూరు ద్వారా గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలని, మానవత్వంతో పని చేసి.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం చేసే మంచిని గిరిజనులు కలకాలం గుర్తు పెట్టుకుంటారని, ప్రతి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాను ఆధార్‌తో లింక్‌ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

 గిరిజనులకు మేలు జరిగేలా చూడాలి
► ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా ఉన్న వారికి మనం రైతు భరోసా అమలు చేస్తున్నాం. అటవీ భూములపై వారికి హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది.  
► గిరిజనులు ఆదాయం పొందడానికి మనం అవకాశాలు కల్పించాలి. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదు. అధికారులు గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలి. 
► వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలించండి. ఆదివాసీ దినోత్సవం నాటికి వారికి అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలి. 
► సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పి.పుష్ప శ్రీవాణి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ప్రతీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి 
జీవో నంబరు 3పై (షెడ్యూల్‌ ఏరియాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరు శాతం ఎస్టీలనే నియమించాలి) గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సీఎం పై విధంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను నిశితంగా అధ్యయనం చేయాలని ఇదివరకే ఆదేశాలిచ్చామని, పరిశీలన పూర్తయ్యాక తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పారు.   

మరిన్ని వార్తలు