రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం

11 Jul, 2019 14:21 IST|Sakshi

రాష్ట్రంలో కరువుపై సభలో ముఖ్యమంత్రి ప‍్రకటన

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల కష్టాలపై ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శానససభలో ప్రకటన చేశారు. రైతన్నలకు తోడుగా ఉండేందుకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని...అధికారంలోకి వచ్చి నెల తిరగకుండానే మాట నిలబెట్టుకున్నామని అన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని...రైతుల కోసం ‘వైఎస్సార్‌ రైతు భరోసా’  పథకం ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. అలాగే రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమం‍త్రి సభాముఖంగా తెలిపారు. మన రాష్ట్రంలో 62శాతం మంది రైతులేనని... ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడి సాయం అందిస‍్తామని అన్నారు.  

రుణమాఫీపై 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని శాసనసభలో స్క్రీన్‌పై ముఖ్యమంత్రి చూపించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.384 కోట్ల బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లిందని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం ఇస్తుందని తెలిపారు. అక్టోబర్‌ 15 నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. అలాగే 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపు చేస్తామని, దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు అని అన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.

సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో 48.3 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయింది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1వ తేదీ నుంచి నిన్నటి వరకు 135.5 మిల్లిమీటర్లు నమోదు కావాల్సి ఉండగా కేవలం 71 మిల్లిమీటర్లు మాత్రమే నమోదు అయ్యింది. సాధారణంగా ఖరీఫ్‌లో 42 లక్షల పంటలు పండుతాయి. ఏటా జూన్‌ నుంచి జులై 10 నాటికి సగటున 9.10 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు వేస్తారు. ఈ ఏడాది కేవలం 3.2 లక్షలహెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వర్షాలు ఆలస్యమయ్యాయి. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వీటిని అన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా ఈ సభలో ఉంచుతున్నాను. మేం అ«ధికారంలోకి వచ్చి కేవలం 45 రోజులు మాత్రమే. అయినా సరే ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ సభలో చాలా మందికి ఈ విషయాలు గుర్తు ఉండే ఉంటాయి. 2013–2014లో ఒక వైపు తీవ్రమైన కరువు, మరోవైపు తుపాన్లతో రాష్ట్రం అల్లకల్లొలమైంది.

గత ప్రభుత్వం 2,300 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు ఎగ్గొట్టింది. గత అయిదేళ్లలో రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులను చూశాం. గత ఖరీఫ్‌లో కరువును ఎదుర్కొనేందుకు రూ.1800 కోట్లు లెక్కకట్టారు. కేంద్రం రూ.900కోట్లు ఇచ్చినా రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. విత్తన సేకరణ ఏప్రిల్‌ నాటికి పూర్తయి మే నెలలో పంపిణీ కావాల్సి ఉంది. అలా కాకపోవడం వల్ల రైతన్నలు రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తన సేకరణకు నిధులు విడుదల చేయాలంటూ అధికారులు ఎన్నిలేఖలు రాసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.330 కోట్ల విత్తన బకాయిలను చెల్లించాలని కోరినా అప్పటి సర్కార్‌ స్పందించలేదు. అయిదేళ్లలో రుణాల రీ షెడ్యూల్‌, రైతుల వడ్డీలు చెల్లించాలనే ఆలోచన లేదు. రూ.87వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ.24వేల కోట్లకు తగ్గించారు. 

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 55లక్షల మంది రైతులకు రూ.2,164కోట్ల బీమా చెల్లిస్తున్నాం. శెనగ రైతులకు క్వింటాకు 1500 చొప్పున రూ.300 కోట్లు విడుదల చేశాం. ఆయిల్‌ ఫాం రైతులకు అదనపు మద్దతు ధర కింద రూ.80 కోట్లు విడుదలతో పాటు రైతులకు నష్టం రాకుండా లోగ్రేడ్‌ పొగాకు ధరలు పెంచి కొనుగోలు చేయించాం. మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నాం. దీనివల్ల రైతులకు ఎలాంటి లబ్ది చేకూరుతుంది, గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసులు చేయాలనే దానిపై అవగాహన వస్తుంది. ధాన్యం సేకరణలో కూడా గత ప్రభుత్వం రూ.960 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశాం. ఆక్వా రైతులకు యూనిట్‌ కరెంట్‌ రూ.1.50కే ఇస్తున్నాం.

గత ప్రభుత్వం చెల్లించని 2వేలకోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లిస‍్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ట్యాక్స్‌ రద్దు చేస్తాం. అధికారంలోకి వచ్చిన నెలలోపే వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేశాం. ప్రతినెలా వ్యవసాయ మిషన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది. డీసీఆర్‌బీ లెక్కల ప్రకారం గత ప్రభుత్వ హయాంలో 1531మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 391మంది రైతులకు మాత్రమే సాయం చేశారు. సాయం అందని బాధిత రైతు కుటుంబాలను ఆదుకుంటాం. 2014-19 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించాం. రూ.2వేల కోట్లతో విపత్తు సహాయనిధి ఏర్పాటు చేస్తున్నాం. ఖరీఫ్‌లో నష్టం వస్తే రబీలో ఆదుకుంటాం. 

16 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపు చేస్తాం. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. వైఎస్సార్ రైతు భరోసా కింద వచ్చే నగదును బ్యాంకర్లు పాత బకాయిలు కింద తీసుకోకుండా నిబంధనలు తీసుకొస్తాం. 11నెలలు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా చట్టాన్ని తీసుకొస్తాం. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తొలి ఏడాదిలోనే పునరుద్ధరిస్తాం. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టుగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస‍్తాం. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజ్‌లు, గిడ్డంగులను తీసుకొస్తాం. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల క్వాలిటీ నిర్థారణకు ప్రతి నియోజకవర్గంలో లాబరేటరీలు ఏర్పాటు చేస్తాం. గ్రామస్థాయిలో వాటిని విక్రయించే ఏర్పాట్లు చేస్తాం. చెరువులను పునరుద్ధరణ చేస్తాం. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై ఇంజినీర్లతో కమిటీ వేశాం. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రివర్స్‌ టెండరింగ్‌ చేస్తాం. 

వచ్చే ఏడాది నుంచి సహకార రైతులకు పాలు పోస్తే లీటర్‌కు రూ.4 బోనస్‌. త్వరలో ప్రారంభం కాబోతున్న గ్రామ సచివాలయం, వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేస్తాం. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించాం. తాగునీటి సమస్య తక్షణ పరిష్కారం కోసం ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయిలు మంజూరు చేస్తాం. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పర్యటించి తాగునీటి సమస్య పరిష్కరించాలి. ప్రతిపక్ష నేత, వారి ఎమ్మెల్యేలకు కోటి రూపాయలు నిధులు కేటాయిస్తాం. వారి నియోజకవర్గాల్లో కూడా తాగునీటి సమస్య లేకుండా చూడాలి. ప్రజల మేలు కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు చూడం. ఈ నిధులన్నీ సీఎం డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద ఇస్తున్నాం. కరువు సమయంలో ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.ఇంకా ఏమైనా ప్రతిపక్ష సూచనలు ఇస్తే..మంచి మనసుతో  ఇవన్నీ కూడా స్వీకరిస్తానని సలహాలు ఇవ్వాలని’ కోరారు.

మరిన్ని వార్తలు