కలెక్టర్‌ సీరియస్‌

3 Jul, 2019 11:33 IST|Sakshi

సాక్షి, పోడూరు(పశ్చిమ గోదావరి) : కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజు మంగళవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో సిబ్బంది హడలెత్తిపోయారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(ఏబీసీడబ్ల్యూఓ)ను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్టేరు సమీపంలో ఉన్న నెగ్గిపూడి బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను నాలుగునెలల కిందటే ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూలు ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్‌ 12వ తేదీ నుంచే స్కూళ్లు తెరిచినా ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్‌ పొందకపోవడంతో  తరగతులు నిర్వహించడంలేదు. 11 హాస్టళ్ల నుంచి దాదాపు 219 మంది విద్యార్థులు నెగ్గిపూడిలోని రెసిడెన్షియల్‌ స్కూల్లో చేరాల్సి ఉంది. ఇంతవరకు ఒక్కరూ చేరలేదు. కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలో ఆయన రికార్డులను పరిశీలించడంతో ఈ వైఫల్యాలన్నీ వెలుగుచూశాయి. 

ఎస్సీ బాలికల హాస్టల్‌ పరిశీలన 
కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మంగళవారం మద్యాహ్నం తణుకు పట్టణంలో అకస్మికంగా పర్యటించారు. మంగళవారం తణుకులోని ఇరగవరం కాలనీలో గల ఎస్సీ బాలికల హాస్టల్‌ను కలెక్టర్‌ ముత్యాలరాజు అకస్మికంగా తనిఖీ చేశారు. తను పరిశీలిస్తున్న విషయం కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్త పాటించారు. ముందుగా తణుకు మండల పరిషత్‌ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే తణుకు పట్టణంలో గతంలో సేకరించిన రాజీవ్‌ స్వగృహ పథకంలో ఉద్యోగుల గృహ వసతి కోసం సేకరించిన 20.8 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అందులో విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎల్‌ శివకుమార్‌ ఉన్నారు.  

మరిన్ని వార్తలు