అయిన వారైతే అందలమే!  

3 Jul, 2019 11:45 IST|Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలులోని డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.ముజఫర్‌ అలీకి గత తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్ల పదవీ కాలాన్ని కట్టబెట్టింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఉర్దూ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయనకు పదవీ విరమణ సమయం రెండు నెలలు ఉండగా అప్పటి ప్రభుత్వం ఉర్దూ వర్సిటీ వీసీగా నియమిస్తూ 2017 మార్చి 25న జీఓ 54ను జారీ చేసింది. నిబంధనలకు, సంప్రదాయాలకు నీళ్లు వదలి నాలుగేళ్ల పదవీ కాలాన్ని ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఆయనపై గత ప్రభుత్వానికి ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్సిటీల యాక్ట్‌ ప్రకారం రాష్ట్రంలోని వైస్‌ చాన్సలర్ల పదవీ కాలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది.

అయితే ఉర్దూ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పదవికి ఏకంగా నాలుగేళ్ల టెన్యూర్‌ ఇవ్వడం గమనార్హం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు కావడంతో గత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్సిటీల వ్యవహారాలను చూసిన విశ్రాంత ప్రొఫెసర్‌ ఒకరు (ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు) ఈ వ్యవహారాన్ని నడిపించారు. కొత్త వర్సిటీ ఏర్పడినప్పుడు ఎలాంటి సెర్చ్‌ కమిటీ లేకుండానే సమర్థవంతుడు, వర్సిటీ అభివృద్ధికి పాటు పడే వ్యక్తిని ప్రభుత్వమే ఎక్స్‌ఆర్డినరీ కేసు కింద వైస్‌ ఛాన్సలర్‌ను  నియమిస్తుంది. అయితే ముజఫర్‌ అలీకి నాలుగేళ్ల పదవిని ఇవ్వడం కోసం ఉర్దూ వర్సిటీ యాక్ట్‌ 13ను ప్రత్యేకంగా తయారు చేయించి.. ప్రభుత్వ ఆమోదం పొందేలా చూశారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఈయన పనితీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ రిజిస్ట్రార్‌కు, ఈయనకు మధ్య విభేదాలున్నాయని తెలుస్తోంది.

రెండు మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను తొలగించారు. కాంట్రాక్ట్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకం కోసం 22 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేశారు. పోస్టుల భర్తీ, నోటిఫికేషన్‌ విడుదల విషయాల్లో వీసీ, రిజిస్ట్రార్‌ రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం సాధించేందుకు ఎవరికి వారు యత్నిస్తున్నారు. గత నెల 24న వర్సిటీలో తరగతులు ప్రారంభమయ్యాయి. సుమారు 150 మంది విద్యార్థులు ఉండగా.. పది మంది కూడా తరగతులకు హాజరు కావడం లేదు. ఆరేడుగురు గెస్ట్‌ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు హాజరు కావడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఉన్నత విద్యాశాఖాధికారులు వర్సిటీపై ప్రత్యేక శ్రద్ధ చూపి చదువుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి« సంఘాల నేతలు కోరుతున్నారు.

అన్నీ సర్దుకుంటాయి 
వర్సిటీలో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే. టీచింగ్‌ స్టాఫ్‌ నియామకంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాటిని అధిగమించి వారంలోగా కాంట్రాక్ట్‌ టీచింగ్‌ స్టాఫ్‌ భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. కొత్త వర్సిటీలు ఏర్పడినప్పుడు వాటి అభివృద్ధికి కొంత సమయం పడుతుంది. అందుకోసమే ప్రత్యేక యాక్ట్‌ ద్వారా నాలుగేళ్ల పదవీకాలం ఇచ్చారు.   
– ప్రొఫెసర్‌ ముజఫర్‌ అలీ, వీసీ, ఉర్దూ విశ్వవిద్యాలయం  

మరిన్ని వార్తలు