పెత్తనంతో పతనం

29 Mar, 2014 01:40 IST|Sakshi
పెత్తనంతో పతనం

*  కాలరేఖపై కరిగిపోతున్న కాంగ్రెస్
* దశాబ్దాలుగా దిగజారుతూ వస్తున్న గ్రాఫ్
* అధిష్టానం నియంతృత్వ ధోరణే కారణం
* చీటికీ మాటికీ ముఖ్యమంత్రుల మార్పు
* బలమైన నేతలను ఎదగనీయని నైజం
* దాంతో ప్రాంతీయ పార్టీల పుట్టుక
* జాతీయ స్థాయిలో సంకీర్ణ శకానికీ బీజం

 
పార్టీ ప్రస్థానం: ఆపాదమస్తకమూ ఆధిపత్య ధోరణి. సొంత పార్టీలో ఎప్పుడు, ఎక్కడ బలమైన నాయకుడు ఆవిర్భవించినా అంతులేని అదిరిపాటు. అలాంటి వారిని ఎలాగోలా అణిచేసి గానీ నిద్రపోని నైజం. ఇష్టానుసారం ముఖ్యమంత్రుల మార్పులు. రాష్ట్ర స్థాయి నేతలతో నిత్యం తోలుబొమ్మ లాటలు. ఒక్క మాటలో చెప్పాలంటే పక్కా నియంత నైజం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ కాంగ్రెస్ అధిష్టానం వ్యవహార శైలి ఇది. ఒక పార్టీగా కాంగ్రెస్ ఇప్పుడు పతనావస్థకు దిగజారిందన్నా, దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు బలీయ శక్తులుగా స్థిరపడుతున్నాయన్నా, జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలదే రాజ్యంగా మారుతోందన్నా... వీటన్నింటికీ చాలావరకు కారణం ఆ ‘అధిష్టాన’ పోకడలే...
 
 స్వాతి:  2009 లోక్‌సభ ఎన్నికలలో 7 జాతీయ పార్టీలు, 34 రాష్ట్ర పార్టీలు, 242 రిజిస్టర్డ్ పార్టీలు కలిపి మొత్తం 363 పార్టీలు పోటీ చేశాయి. 3,831 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. 15వ లోక్‌సభలో 38 పార్టీలకు ప్రాతి నిధ్యం లభించింది. మరో 9 మంది స్వతంత్రులూ ఉన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రంగం లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, గుజరాత్ పరివర్తన్ పార్టీ వంటివాటితో కలిపి దేశవ్యాప్తంగా పార్టీల సంఖ్య సుమారు 1,600కు చేరింది. అసలిన్ని పార్టీలు ఎలా పుట్టా యి? దేశంలో సంకీర్ణ రాజకీయాలను సృష్టిం చిన వీటి ఆవిర్భావానికి పూర్వ రంగం ఏమిటి?
 
కాంగ్రెస్ సిస్టమ్
 స్వాతంత్య్రానంతరం చాలాకాలం పాటు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంటూ వచ్చింది. సుప్రసిద్ధ విద్యావేత్త రజినీ కొఠారీ దీన్ని ‘కాంగ్రెస్ సిస్టమ్’గా పేర్కొన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం 1950, 60 దశకాల్లో ఆ పార్టీకి చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా కేంద్రం కనుసన్నల్లోనే మెలగేవారు. అలాగాక తన విధానాలతో విభేదించిన వారిని ఇందిరా గాంధీ ఎన్నడూ సహించలేదు. అలాంటి స్వరం విన్పించిన ప్రదేశ్ కాంగ్రెస్ నేతలను కట్టడి చేసేందుకు 1967, 1975ల్లో ఆమె తీవ్రంగా ప్రయ త్నించారు.
 
  1969లోనైతే ఏకంగా ఆమె పార్టీనే చీల్చారు. రాష్ట్రాల ఎన్నికలను, జాతీయ ఎన్నికలను విడదీ శారు. ఎమర్జెన్సీ విధింపు తర్వాత పలువురు నేతలు ఆమెతో విభేదించి వెళ్లిపోయారు. అదే అదనుగా ఆమె పార్టీని పునర్వ్యవస్థీకరించారు. 1980లో 351 సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లోని సంస్థాగత అధికారాన్ని ఇందిర మరింతగా కేంద్రీకృతం చేశారు. నియంతృత్వ పోకడలతో ముఖ్యమంత్రులను కీలుబొమ్మలుగా మార్చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారు అధిష్టానంపై ఆధారపడేలా చేశారు.
 
 తలబిరుసు ధోరణులు
 1980లలో రాష్ట్రాల స్థానికాంశాల్లో కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన తల బిరుసు ధోరణులు  పలు పార్టీల పుట్టుకకు దారి తీశాయి. ‘భగవాన్ ఊపర్, ఔర్ ఇం దిరా గాంధీ యహా’ అని బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా వ్యాఖ్యానించడం నాటి పరి స్థితులకు అద్దం పడుతుంది. 1984లో ఇందిర హత్యానం తరం రాజీవ్ గాంధీ హయాంలోనూ ఇదే ధోరణి కొనసాగింది. ముఖ్య మంత్రులను ఇష్టం వచ్చినట్లు మార్చడం, రాష్ట్రాలకు ఏ విలువా ఇవ్వకపోవడం షరా మామూలుగానే సాగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో 1980-1989 మధ్యకాలంలో ఐదుసార్లు ముఖ్య మంత్రులను మార్చారు. బిహార్‌లో 1983లో చంద్రశేఖర్ సింగ్‌ను, 1985లో బిందేశ్వరీ దూబేని, ఆ తర్వాత భగవత్ ఝా ఆజాద్, సత్యేంద్ర   నారాయణ్ సింగ్, మిశ్రాలను సీఎంలుగా నియమించారు.
 
 మహారాష్ట్రలో 1980-1985 మధ్యకాలంలో ఏఆర్ అంతూలే, బాబా సాహెబ్ భోస్లే, వసంత్ దాదా పాటిల్ సీఎంలయ్యారు. 1985-1990 మధ్య శివాజీరావు పాటిల్, శంకర్‌రావు చౌహాన్, శరద్ పవార్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే ధోరణి. 1978-1983 మధ్య మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రామ్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంలుగా నామినేటయ్యారు. స్థానిక ఆకాంక్షలను పట్టించుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం ఇలా తలపొగరుగా వ్యవహరించడం వల్ల తెలుగు ఆత్మగౌరవం దెబ్బతిందన్న భావం కలిగింది. దీనివల్లే ఎన్టీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నాడు తొమ్మిది నెలల్లోనే అధికారం కైవసం చేసుకోగలిగింది. ఆ తర్వాత కూడా ఇందిర కక్షసాధింపుతో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపరిచి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అస్సాంలో కూడా ఇదే జరిగింది. 1980-1985 మధ్య అన్వరా తైమూర్, కేసీ గొగోయ్, హితేశ్వర్ సైకియా రూపంలో ముగ్గురు సీఎంలను మార్చారు. దాంతో 1985 ఎన్నికల్లో ప్రఫుల్ల మహంతా నాయకత్వంలోని అసోం గణ పరిషద్ ఘనవిజయం సాధించింది. కర్ణాటక కథా ఇంతే. ప్రజాదరణ ఉన్న దేవరాజ్ అర్స్‌ను సంజయ్ గాంధీ బలవంతంగా తప్పించి గుండూరావును ముఖ్యమంత్రిని చేశారు. దరిమిలా 1983 ఎన్నికల్లో రామకష్ణ హెగ్డే నాయకత్వంలోని జనతా పార్టీ కాంగ్రెస్‌ను మట్టికరిపించింది.
 
  1989-1994 మధ్యకాలంలో ఎస్‌ఆర్ బొమ్మైప్రభుత్వాన్ని డిస్మిస్ చేశాక వీరేంద్ర పాటిల్, బంగారప్ప, వీరప్ప మొయిలీలను సీఎంలుగా నియమించారు. రాజీవ్ ఏకపక్షంగా పాటిల్‌ను తొలగించిన తీరుతో ఆగ్రహించిన లింగాయత్‌లు బీజేపీకి మద్దతుదారులుగా మారారు. రాజస్థాన్‌లో కూడా 1980-1985 మధ్య జగన్నాథ్ పహాడియా, శివచరణ్ మాథూర్, హీరాలాల్ దేవపురా సీఎంలయ్యారు. 1990లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు హరిదేవ్ జోషీని సీఎం చేశారు. మధ్యప్రదేశ్‌లో 1985 ఎన్నికల తర్వాత అర్జున్‌సింగ్‌ను తొలగించి మోతీలాల్ వోరాను నియమించారు. మూడేళ్ల తర్వాత 1988లో అర్జున్‌సింగ్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా తెచ్చారు. కొద్దికాలానికే తిరిగి వోరాను తీసుకొచ్చారు. ఏడాది కాగానే, అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు శ్యాం చరణ్ శుక్లాను సీఎం చేశారు.
 
 కీలుబొమ్మలు-తోలుబొమ్మలు
 ఇలా దేశమంతటా సీఎంలను తోలుబొమ్మలుగా మార్చేసిన కాంగ్రెస్ తీరే ప్రాంతీయ పార్టీల పుట్టుకకు దారితీసింది. నేతల్లో అభద్రతా భావం, అసమ్మతి పెరిగాయి. తొలగింపుకు గురైనవారు వేరు దారులు వెతుక్కోవడం మొదలు పెట్టారు. బలమున్న నేతలు సొంత పార్టీలు పెట్టారు. సీఎంల మార్పు తరచుగా జరగని పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పార్టీల సంఖ్య కూడా తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. స్థానిక కాంగ్రెస్ నేతలు బలం పెంచుకోవడానికి ఇష్టపడని అధిష్టానం వైఖరి అంతిమంగా ఆ పార్టీ పరిస్థితినే దిగజార్చింది. ఎంతసేపూ... రాష్ట్రాల్లో నేతలు బలం పుంజుకుంటే తన ప్రాభవం కొడిగడుతుందనే ఆలోచించింది. ఆంధ్రప్రదేశ్ పరిణామాలే అందుకు తిరుగులేని రుజువు. మహా నేత వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత అధిస్టానం కొణిజేటి రోశయ్య వంటి ప్రజాదరణ లేని నాయకుడికి పగ్గాలు అప్పగించిందే తప్ప సీఎల్పీలో మెజారిటీ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రం అంగీకరించలేకపోయింది. తర్వాత కూడా జనంలో పట్టు లేని కిరణ్ కుమార్‌రెడ్డిని సీల్డ్ కవర్ సీఎం చేసి తప్పు మీద తప్పు చేసింది. నిజానికి వైఎస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్న మాటేగాని ఆయన సొంత బలం వల్లే 2004లో అధికారంలోకి రాగలిగారు. అంతేకాదు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 ఎంపీ సీట్లను అందించి కేంద్రంలో యూపీఏ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కారణమయ్యారు.
 
 ఇలా మిగిలింది...
 1984లో ఏకంగా 415 లోక్‌సభ సీట్లు సాధించిన కాంగ్రెస్, 1989లో కేవలం 197 స్థానాలకు కుంచించుకుపోయింది. 1991 మధ్యంతర ఎన్నికలలో కేవలం 240 సీట్లే వచ్చినా మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసి, ఫిరారుుంపుల సాయంతో ఐదేళ్లూ బండి లాగించింది. కానీ 1989 నుంచేకాంగ్రెస్ పతనం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటినుంచీ కాంగ్రెస్ గణనీయంగా బలాన్ని కోల్పోతూ, చిన్నాచితకా పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితికి దిగజారుతూ వచ్చింది. ఆ లెక్కన ‘1989’ని ‘కాంగ్రెస్ సిస్టమ్‌కు తెర పడే’ ధోరణి మొదలైన కాలానికి సంకేతంగా పరిగణించవచ్చు.

మరిన్ని వార్తలు