పెదబాబు డైరెక్షన్‌ ..చినబాబు యాక్షన్‌

3 Mar, 2019 05:03 IST|Sakshi

ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర

ఓటర్ల పేరిట ఆన్‌లైన్‌లో నకిలీ దరఖాస్తులు

గత ఏడాది నవంబర్‌ నుంచి ఇదే పనిలో చినబాబు బృందం

ఒక్కో నియోజకవర్గంలో 6 నుంచి 21 వేల ఓట్లు తొలగింపు లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా 8,73,500 ఫారం–7 దరఖాస్తులు 

అత్యధికంగా గుంటూరు,చిత్తూరు జిల్లాల్లోనే... 

ఓట్ల తొలగింపును తీవ్రంగా పరిగణిస్తున్న ఎన్నికల సంఘం 

కుట్రపూరితంగా దరఖాస్తు చేసిన వారిపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశం 

సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో కేవలం డబ్బులు పంచిపెట్టినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించిన పెదబాబు, చినబాబు ఇప్పుడు ఏకంగా ఓటర్లపైనే గురి పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సానుభూతిపరులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ గత ఏడాది నవంబర్‌ నుంచి నిరాటంకంగా కొనసాగతోంది. ఇందుకు మార్గదర్శకత్వం పెదబాబుది కాగా, దాన్ని అమలు చేసే బాధ్యతను చినబాబు తన భుజాలపై వేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 6,000 నుంచి 21,000 ఓట్లను తొలగించడమే ధ్యేయంగా చినబాబు బృందం పనిచేస్తోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లపై వేటు వేసేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎవరి ఓట్లను తొలగించాలో వారి పేర్లతోనే ఆన్‌లైన్‌ ద్వారా ఫారం–7 దరఖాస్తులను చినబాబు బృందం సమర్పిస్తోంది. తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటూ నవంబర్‌ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 8,73,500 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో రావడం గమనార్హం. ఓట్ల తొలగింపును కోరుతూ ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

నివ్వెరపోతున్న ఎన్నికల సంఘం 
ఒక్కో జిల్లా నుంచి ఆన్‌లైన్‌లో వేల సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడం చూసి  ఎన్నికల సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని నిర్ణయించింది. అత్యధికంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఫారం–7 దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా నుంచి 1,13,500, చిత్తూరు జిల్లా నుంచి 1,02,500 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 90 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇవన్నీ కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా సమర్పించినవేనని ఎన్నికల సంఘం గుర్తించినట్లు సమాచారం. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో వచ్చిన ఫారం–7 దరఖాస్తులపై క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలని, ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు సమర్పించిన వారిని గుర్తించి, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది.

మరిన్ని వార్తలు