కానిస్టేబుల్‌ రెండో భార్య ఆత్మహత్య

11 Oct, 2018 11:25 IST|Sakshi

భార్యాభర్తల మధ్య విభేదాలే కారణం? 

మదనపల్లె క్రైం: మదనపల్లెలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ రెండో భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్త మొదటి భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూరల్‌ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మదనపల్లె సీటీఎం రోడ్డు, బాలాజి నగర్‌కు చెందిన కానిస్టేబుల్‌ కోలా వెంకటరమణ చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వద్ద గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన స్వగ్రామం కలకడ మండలం అక్కన్నగారికోట. అదే గ్రామానికి చెందిన రెడ్డెమ్మ, శేఖర్‌ల కుమార్తె సరస్వతి(35)ని 15 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం మదనపల్లె పట్టణం బాలాజీనగర్‌లో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు హర్షవర్ధన్‌ (14), ప్రవల్లిక (12)లు ఉన్నారు.

 దంపతులు ఇద్దరూ తరచూ గొడవపడేవారు. వ్యవహారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు కూడా చేరింది. అక్కడ పోలీసులు సర్దిచెప్పి పంపారు. కొంతకాలంగా వీరి సంసారం సజావుగానే ఉండగా, నెల రోజులుగా సరస్వతిని వెంకటరమణ మొదటి భార్య వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పది రోజుల క్రితం మదనపల్లెకు వచ్చిన భర్తతో విషయం చెప్పి కన్నీటిపర్యంతమైంది. ఈ విషయాన్ని భర్త తేలికగా తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఆయన విధుల నిమిత్తం చిత్తూరుకు వెళ్లారు. 

ఇంతలో ఏం జరిగిందో ఏమో బుధవారం వేకువజామున సరస్వతి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించిన తల్లిని చూపి కంపించిపోయారు. వారు కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ రమేష్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సునీల్‌కుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి మృతితో ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. తమకు దిక్కెవరంటూ విలపిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. 
  

మరిన్ని వార్తలు