పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

15 Dec, 2014 02:33 IST|Sakshi

కావలిఅర్బన్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హామీ ఇచ్చారు. తుమ్మలపెంట పర్యాటక కేంద్రాన్ని కలెక్టర్ జానకితో కలసి ఆదివారం మంత్రి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తుమ్మలపెంట పర్యాటక కేంద్రం కావలి పరసర ప్రాంత ప్రజల సందర్శనకు వీలుగా ఉంటుందన్నారు.
 
  అతి కొద్దిమంది జీవిస్తున్న సింగపూర్ వలే ఆంధ్రప్రదేశ్‌ను కూడా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారన్నారు. గుజరాత్ సముద్ర తీరం తరువాత ఆంధ్రప్రదేశ్‌కే 970 కిలోమీటర్ల పొడవున్న తీర ప్రాంతం ఉందన్నారు.  తుమ్మలపెంట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మరో మూడున్నర ఎకరాల భూమిని తీసుకోనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారం తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
 
 మత్య్సకారుల నీటిని వాడుకుంటున్నారు
 తాము నిర్మించుకున్న పైపులైన్ ద్వారా వస్తున్న తాగునీటిని ఏపీ టూరిజం అధికారులు వాడుకుంటున్నారని మత్య్సకారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వేట సమయంలో తాగునీరు సరిపోక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సోమశిల నీటితో తుమ్మలపెంట చెరువును నింపి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. తన దృష్టికి తెచ్చిన సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మేయర్ అజీజ్, టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మ, ఆర్డీఓ లక్ష్మీ నరసింహం, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, తహశీల్దారు సాంబశివరావు, పర్యాటక కేంద్రం మేనేజర్ చంద్రశేఖర్, నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం, కండ్లగుంట మధుబాబు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు