Narendra Modi: నా మూడో ఇన్నింగ్స్‌ పక్కా!

18 Dec, 2023 04:30 IST|Sakshi

సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ భవన ప్రారంభంలో మోదీ

సూరత్‌: ప్రధానమంత్రిగా తన మూడో ఇన్నింగ్స్‌లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తాను వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవుతానని పరోక్షంగా తేలి్చచెప్పారు. గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్‌ డైమండ్‌ బోర్స్‌’ భవనాన్ని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.  ఈ వాణిజ్య కేంద్రం నూతన భారతదేశ బలానికి, అంకితభావానికి ఒక ప్రతీక అని చెప్పారు.

సూరత్‌ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కలి్పస్తోందని ప్రశంసించారు. కొత్త వాణిజ్య సముదాయంతో మరో 1.5 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.  సూరత్‌ కీర్తికిరీటంలో మరో వజ్రం చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న వజ్రం కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వజ్రమని వ్యాఖ్యానించారు. దీని వెలుగుజిలుగుల ముందు ప్రపంచంలోనే పెద్దపెద్ద భవనాలు కూడా వెలవెలబోతాయని అన్నారు. ప్రపంచంలో వజ్రాల పరిశ్రమ గురించి ఎవరూ మాట్లాడుకున్నా ఇకపై సూరత్‌ను ప్రస్తావించాల్సిందేనని చెప్పారు.

సూరత్‌ భాగస్వామ్యం పెరగాలి  
వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్దేశించుకుందని మోదీ చెప్పారు. దేశాన్ని దాదాపు 10 ట్రిలియన్‌ డాలర్ల(10 లక్షల కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడంతోపాటు ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. దేశం నుంచి ఎగుమతుల విషయంలో సూరత్‌ సిటీ భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. వజ్రాలు, ఆభరణాల పరిశ్రమకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు.
 
భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు  
నేడు ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఎన్నో అంశాల్లో మనపై ఆధారపడుతున్నాయని, మన దేశ పేరు ప్రతిష్టలు పెరిగాయని, మేడిన్‌ ఇండియా ఇప్పుడు బలమైన బ్రాండ్‌గా మారిందన్నారు. లక్షలాది మంది యువతకు సూరత్‌ డ్రీమ్‌ సిటీగా మారిందని, ఇక్కడ ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సూరత్‌ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటిగ్రేటెడ్‌ టెరి్మనల్‌ బిల్డింగ్‌ను మోదీ ఆదివారం ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు