కరోనా: కోయంబేడు కలకలం 

17 May, 2020 09:17 IST|Sakshi

జిల్లాలో మరో మూడు కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు 

కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారే బాధితులు

సాక్షి, ఒంగోలు: జిల్లాలో ఉన్న 63 కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులన్నీ కోలుకుని నెగిటివ్‌ రావడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న దశలో మరో మూడు పాజిటివ్‌ కేసులు శనివారం నమోదయ్యాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన జిల్లా వాసులకు కోవిడ్‌–19 పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ మార్కెట్‌ కేంద్రంగానే కరోనా కేసులు విస్తృతంగా వ్యాపించాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కొంత మంది వలస కూలీలు పనుల కోసం గతంలో చెన్నై వెళ్లారు. వారంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నడక, ఇతర మార్గాల ద్వారా జిల్లాకు, ఇతర జిల్లాల వారు మన జిల్లా మీదుగా వెళ్లిపోయారు.  

అలా వెళ్లి వచ్చిన వారిలో  ప్రస్తుతం ఒంగోలు కమ్మపాలెం నుంచి ఒకరికి, కొత్తపట్నం నుంచి ఇద్దరికి  ట్రూనాట్‌ పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో, పూర్తి స్థాయి నిర్ధారణ పరీక్ష అయిన వీఆర్‌డీఎల్‌ను నిర్వహించగా పాజిటివ్‌లుగా నిర్ధారించారు. ప్రస్తుతం నిర్ధారణ అయిన మూడు కేసులు కోయంబేడు మార్కెట్‌తో ముడిపడినవిగా అధికారులు తేల్చారు. ఒంగోలు కమ్మపాలేనికి చెందిన 30 సంవత్సరాల వ్యక్తికి, కొత్తపట్నంకు చెందిన 44 సంవత్సరాల వ్యక్తికి, రాజుపాలెంకు చెందిన 31 సంవత్సరాల వ్యక్తులకు పాజిటివ్‌లుగా నిర్ధారించారు. వీరంతా కూరగాయల వ్యాపారస్తులు, డ్రైవర్లు. కూరగాయలను కోయంబేడుకు తరలించిన వారు.  

మొత్తం 170 మంది..
కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో జిల్లాలో దాదాపు 170 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 130 మంది శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు. మరో 40 శాంపిల్స్‌ను పరీక్షించాల్సి ఉంది. అదే విధంగా పాజిటివ్‌ వచ్చిన వారితో దగ్గరగా ఉన్న 14 మంది స్వాబ్‌లను కోవిడ్‌ 19 నిర్ధారణ పరీక్షలకు పంపించారు. మరో నలుగురి స్వాబ్‌లను తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఇరువురు ఇప్పటికే ట్రిపుల్‌ ఐటీలో క్వారంటైన్‌లో ఉండగా, మిగిలిన వ్యక్తి జీజీహెచ్‌లో ఉన్నాడు. వీరందరినీ శనివారం రాత్రి  కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్‌ వైద్యశాల, జిల్లా కోవిడ్‌ వైద్యశాలకు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.

జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎల్‌ జాన్‌ రిచర్డ్స్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పాజిటివ్‌ వ్యక్తులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద వారం రోజులుగా జిల్లాలో ఒక్క కోవిడ్‌ 19 కేసు నమోదు కాకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. మూడవ దశ లాక్‌డౌన్‌ కూడా ముగుస్తుండటంతో, 4వ దశలో కొన్ని వెసులుబాటులు ఉండవచ్చని భావించారు. అయితే కొత్త కేసులు, కొత్త ప్రాంతాల్లో నమోదవుతుండటంతో ఆ ప్రాంతాలపై కూడా లాక్‌డౌన్‌ పడనుంది.
 

మరిన్ని వార్తలు