గుంతకల్లులో తొలి కరోనా కేసు

20 Apr, 2020 11:21 IST|Sakshi
హిందూపురం: మాట్లాడుతున్న ఐజీ సంజయ్‌

జిల్లాలో 29కి చేరిన కరోనా బాధితుల సంఖ్య  

గుంతకల్లు, హిందూపురంలో హైఅలర్ట్‌ 

సాక్షి, అనంతపురం: జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. ఇందులో ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 24 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆదివారం అధికారికంగా హెల్త్‌ బులెటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా నిర్ధారణ అయిన వారిలో హిందూపురానికి చెందిన 20 ఏళ్ల యువకుడు, 54 ఏళ్ల వ్యక్తి (పరిగి ఏఎస్‌ఐ), గుంతకల్లులో 45 ఏళ్ల మహిళ ఉన్నారు.

వీరిలో హిందూపురంలో నివాసం ఉంటున్న 54 ఏళ్ల ఏఎస్‌ఐ రెండు రోజుల కిందటే మృత్యువాత పడ్డాడు. వీరికి కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారన్‌టైన్‌ తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గుంతకల్లుకు చెందిన మహిళ ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో అడ్మిషన్‌లో ఉంది. కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి వారి కాంటాక్ట్‌లపై ప్రత్యేక దృష్టిసారించామని, కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్యశాఖాధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారని కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. 

పరిగిలో కలకలం..  
పరిగి: పరిగి ఏఎస్‌ఐ రెండు రోజుల క్రితం మృతి చెందగా, మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయన పలు గ్రామాల్లో ప్రజలకు మాస్కులను పంపిణీ చేయగా.. ఆయన కలిసిన వారిలో 70 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరిలో 40 మందిని కరోనా పరీక్షలకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మి తెలిపారు. 

పురంలో ప్రత్యేక బృందాలు.. 
హిందూపురం: రెండు రోజుల క్రితం మృతి చెందిన ఏఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఐజీ ఎన్‌.సంజయ్, డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ డిల్లీరావులు తెలిపారు. విధి నిర్వహణలో ఉంటూ కరోనా బారి మృతి చెందిన ఏఎస్‌ఐ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. ఇక హిందూపురం ప్రాంతంలో కోవిడ్‌–19 విధుల నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలు నియమించి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు. లాక్‌డౌన్‌ను అతిక్రమించి ఎవరైనా బయటకు వస్తే వాహనాలు సీజ్‌ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీలు ఏ.శ్రీనివాసులు, మహబూబ్‌బాషా, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. అంతకుముందు వారు రెడ్‌జోన్లలో పర్యటించి సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు.

గుంతకల్లులో తొలి కరోనా కేసు.. 
గుంతకల్లు: పట్టణంలోని ఆంథోని స్ట్రీట్‌లో నివాసముంటున్న 45 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నమోదు కాగా, అధికారులు ఆమె భర్తను క్వారంటైన్‌కు తరలించారు. బాధిత మహిళ కూరగాయల వ్యాపారి కాగా, ఆమె పట్టణంలో ఎవరెవరిని కలిసింది అన్న వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఆంథోని స్ట్రీట్‌ను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

మరిన్ని వార్తలు