పట్టణాల్లో కురవని 'అమృత్‌'

20 Dec, 2018 03:59 IST|Sakshi

కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ముందుకు సాగని పనులు 

తొలిదశలో విడుదలైన రూ.2,717 కోట్లలో రూ.400 కోట్లే ఖర్చు 

60 రక్షిత నీటి పథకాలు, పార్కుల నిర్మాణాల్లో 30 శాతమే పనులు 

సమస్యలు పరిష్కారానికి నోచుకోక జనం ఇక్కట్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అటల్‌ మిషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(అమృత్‌) పథకం పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించడం, ఆ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ప్రభుత్వం కేటాయించలేకపోవడంతో ‘అమృత్‌’ పథకం పడకేసింది. నగరాలు, పట్టణాలను పట్టిపీడిస్తున్న రక్షిత మంచినీరు, మురుగునీటి సరఫరా సమస్యలు ‘అమృత్‌’ పథకంతో పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశించారు. అయితే, తొలిదశలో విడుదలైన నిధులను మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయాయి. రెండో దశలో చేపట్టనున్న పథకాలకు నిధులు విడుదల చేయాలని అందచేసిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. దీంతో సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.  

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతితోపాటు 31 నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీలను ‘అమృత్‌’ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కనీసం లక్ష జనాభా కలిగిన నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిబంధన విధించింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వంటి కార్పొరేషన్లతోపాటు మచిలీపట్నం, గుడివాడ, ఆదోని, నరసరావుపేట, చిలకలూరిపేట వంటి చిన్న మున్సిపాల్టీలను అమృత్‌ పథకం కింద ఎంపిక చేశారు. ఈ పథకం అమలుకు కేంద్రం ఐదేళ్లపాటు విడతల వారీగా నిధులను విడుదల చేస్తుంది. తొలిదశలో రూ.2,717 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఇప్పటిదాకా రూ.400 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు.  

విశాఖపట్నంలో పాతపైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు, నివాస గృహాలకు కుళాయిలు, మురుగునీటి శుద్ధిప్లాంట్‌ నిర్మాణాలకు నిధులు విడుదల కాగా, నిర్మాణ సంస్థలు పనుల్లో జాప్యం చేస్తున్నాయి. 75 వేల కుళాయిలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటిదాకా 23 వేల కుళాయిలనే ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో రూ.82 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు, పార్కుల సుందరీకరణ, ఎస్‌టీపీ ప్లాంట్‌ నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.17.80 కోట్లతో నిర్మించనున్న ఎస్‌టీపీ ప్లాంట్‌ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. 

నిధులున్నా.. పనులేవీ? 
గుంటూరు జిల్లా తెనాలిలో రక్షిత మంచినీటి పథకం అమల్లో భాగంగా ఇచ్చే కుళాయి కనెక్షన్‌లు మందకొడిగా సాగుతున్నాయి. దీనికోసం అమృత్‌ పథకం కింద రూ.9 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలోని 21,748 గృహాలకు రక్షిత మంచినీటి కుళాయి కనెక్షన్‌లు ఇవ్వాలని నిర్ణయించగా, 12 వేల కనెక్షన్‌లు మాత్రమే ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఒప్పందం కాలపరిమితి ముగియనుంది. మచిలీపట్నం మున్సిపాల్టీకి రూ.37.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, 9,158 కుళాయిలు, 156.465 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్‌ పైప్‌లైన్లు, 8.42 కిలోమీటర్ల మేర పంపింగ్‌ మెయిన్‌ల ఏర్పాటు వంటి పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. తిరుపతిలో రూ.72 కోట్లతో కొత్త పైప్‌లైన్ల నిర్మాణం, ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మూడేళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఖరారు కాని టెండర్లు 
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని నిర్మాణ సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు విధించారు. దాంతో కొన్ని సంస్థలకు ఐదారు నగరాల్లోని పనులు గంపగుత్తుగా లభించాయి. ఆ సంస్థలు సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన పనులకు టెండర్లు ఆహ్వానిస్తే 23 పథకాల నిర్మాణ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మూడు ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు కాలేదు. 60 పార్కుల సుందరీకరణకు టెండర్లు ఆహ్వానిస్తే 56 పార్కులకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో 41 పార్కుల పనులు కేవలం 30 నుంచి 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక మురుగునీటి శుద్ధిప్లాంట్‌ల నిర్మాణాలకు నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవడంతో నగరాలు, పట్టణాల్లో మురుగునీటి సమస్య వేధిస్తోంది.  

మరిన్ని వార్తలు