అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు

11 Mar, 2018 11:50 IST|Sakshi
సీపీఎస్‌ బాధితులకు మద్దతు తెలుపుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి

బాధితులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుంది

సీపీఎస్‌ ఉద్యోగుల దీక్షకు భూమన కరుణాకర్‌రెడ్డి మద్దతు

చిత్తూరు ఎడ్యుకేషన్‌ : వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని తమ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమనకరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక పీసీఆర్‌ పాఠశాల ఎదుట చేపట్టిన రెండు రోజుల నిరవధిక నిరాహర దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ బాధితులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. నూతన పెన్షన్‌ విధానం వలన ఎంతో మంది ఉద్యోగుల కుటుంబాలకు భద్రత లేకుండా పోతోందన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆసరాగా ఉన్న పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైఎస్సార్‌ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు తన చేతిలో లేదని సీఎం చంద్రబాబునాయుడు చెప్పే మాటలను నమ్మే స్థితిలో ఉద్యోగులు లేరని తెలిపారు. ఆయనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు సమీర్, లోకేష్‌బాబు మాట్లాడుతూ సీపీఎస్‌ విధానం వలన తమ కుటుంబాలకు భద్రత లేదన్నారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్‌ను పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో ఆ సంఘం నాయకులు నోబెల్, ఎస్‌పీబాషా, రాజేష్, వెంకటయ్య, వరదరాజులు, వెంకటరమణ, వైఎస్సార్‌ సీపీ నగర బీసీ సెల్‌ అధ్యక్షుడు జ్ణానజగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు