క్షణికావేశం

4 Mar, 2015 02:41 IST|Sakshi

పెనుకొండ: పంతాలు.. పట్టింపులు ఆ దంపతుల నిండు జీవితాలను బలితీసుకున్నాయి.. కుటుంబ కలహాలతో క్షణికావేశానికి గురైన ఉపాధ్యాయ దంపతులు తమ కలల పంట అయిన రెండేళ్ల చిన్నారిని ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు చేరారు.. చిన్న సమస్యను పరిష్కరించుకోవడంలో రాజీ పడలేక నిండు ప్రాణాలను బలవంతంగా తీసుకున్నారు. పెనుకొండ పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాదాంతం వివరాలు ఇలా ఉన్నాయి.
 
 బుక్కపట్టణం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్(27) సోమందేపల్లి మండలం జూలుకుంట గ్రామ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తాడిపత్రికి చెందిన ఏఎస్‌ఐ రామచంద్రారెడ్డి కుమార్తె రమాదేవి(23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండు సంవత్సరాల కుమార్తె తేజస్విని ఉంది. రమాదేవి డీఎస్సీ రాసేందుకు సిద్ధమవుతుంది. ఆమె చదువుకు అండగా ఉంటున్న చంద్రశేఖర్  కుమార్తె తేజస్వినిని తన స్వగ్రామంలో తల్లిదండ్రులు వద్ద వదలి రావాలని అనుకున్నాడు. అయితే తమ తల్లిదండ్రుల వద్ద వదిలిరావాలని రమాదేవి అనడంతో ఇద్దరి మధ్య మాటామాటా జరిగింది. మూడు రోజుల పాటు వివాదం కొనసాగింది. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరు గొడవపడి వేర్వేరు గదుల్లో నిద్రించారు. మంగళవారం ఉదయం నిద్రలేచిన చంద్రశేఖర్ ఎంతకీ భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో కిటికీలో నుంచి చూశాడు.
 
  గదిలో పైకప్పుకు ఉరివేసుకుని ఉన్న రమాదేవి కనిపించింది. దీంతో తీవ్రంగా కలత చెందిన  చంద్రశేఖర్ వెంటనే కొండాపురం రైల్వేలైన్ వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత రైల్వే పోలీసులు భావించారు. రమాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం బయట పడగా భర్త కోసం ఆరా తీశారు. ఆచూకీ లేకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో రైలు కిందపడి మరణించిన వ్యక్తిపై దృష్టి మళ్లించారు. ఘటనా స్థలానికి వెళ్లగా చనిపోయిన వ్యక్తి ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌గా తేలింది. సమాచారం అందుకున్న సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్‌ఐ లింగణ్ణలు ఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఇద్దరి మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
 పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉపాధ్యాయులు
 విషయం బయటకు రావడంతో పట్టణవాసులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున మృతుడు చంద్రశేఖర్ ఇంటి వద్దకు చేరుకున్నారు.    చిన్నారి తేజస్విని చూసి మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. మృతుల కుటుంబీకులు పట్టణానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. మృతదేహాలను అగ్రహారం తరలించడానికి ఏర్పాట్లు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు