50 వేల టీకాలు | Sakshi
Sakshi News home page

50 వేల టీకాలు

Published Wed, Mar 4 2015 2:43 AM

50 thousand vaccines

 సాక్షి, చెన్నై:రాష్ట్రంలో జ్వరాలు తాండవం చేస్తున్నాయి. కొందరికి పరీక్షల రూపంలో స్వైన్ ఫ్లూ నిర్ధారణ కాగా, మరి కొందరు ఆ లక్షణాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది వరకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక చెన్నైలో ఈ ఫ్లూ బారిన పడ్డ వారి సంఖ్య పది దాటింది. మంగళవారం ముగ్గురు పాఠశాలల విద్యార్థులు ఈ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. మరో ఇంజనీరు సైతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫ్లూ భయం ప్రజల్లో పెరుగుతుండడంతో అవగాహన కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ఈ ఫ్లూ నివారణ చర్యల్ని వేగవంతం చేయడం లక్ష్యంగా ఆరోగ్య శాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి విజయ భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.
 
 ఆయా జిల్లా అధికారులు ఫ్లూ నివారణ లక్ష్యంగా చర్యలు వేగవంతం చేసేందుకు సూచనలు ఇచ్చారు. మంత్రి విజయ భాస్కర్ పేర్కొంటూ, స్వైన్ ఫ్లూను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. పక్క రాష్ట్రాల నుంచే ఈ ఫ్లూ రాష్ర్టంలోకి వచ్చిందన్నారు. ఈ దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా జ్వరం బారిన పడి రాష్ట్రంలోకి వచ్చిన పక్షంలో వారికి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి అనుమతించడం లేదా, వెనక్కు పంపించే విధంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వైద్య నిపుణుల బృందం ఈ శిబిరాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్టు పేర్కొన్నారు. సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో అదనపు సిబ్బందితో అదనపు శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.
 
 అవగాహన కార్యక్రమాల్ని వేగవంతం చేయడానికి అన్ని జిల్లా యంత్రాంగాలను ఆదేశించామన్నారు. ఎవరైనా పిల్లలు జ్వరంతో బాధ పడుతున్న పక్షంలో వారిని బలవంతంగా పాఠశాలలకు పంపించ వద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. ఈ ఫ్లూ తీవ్రత పెరగకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ టీకాలను, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేస్తారని చెప్పారు. జ్వరం బారిన పడ్డ వారికి మాత్రమే వేస్తామని, అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రస్తుతం తమ వద్ద 20 వేల టీకాలు సిద్ధంగా ఉన్నాయని, మరో 30 వేల టీకాలను కొనుగోలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. డామ్లీ ఫ్లూ మాత్రలు నాలుగు లక్షలు తమ చేతిలో ఉన్నాయని, వీటిని అన్ని ఆస్పత్రులకు పంపించామన్నారు.
 
 

Advertisement
Advertisement