కస్టోడియల్ మిస్టరీ!

14 Feb, 2015 01:16 IST|Sakshi
కస్టోడియల్ మిస్టరీ!

రమేష్ మృతిపై మొదటి నుంచి పోలీసుల తీరు అనుమానాస్పదం
తొలుత పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆత్మహత్య
చేసుకున్నాడని ప్రకటన..ఆ తర్వాత కస్టోడియల్ డెత్‌గా నిర్ధారణ
స్వాధీనం చేసుకున్న బంగారం ఎంత..?
సీసీఎస్‌ను విస్మరించడంలో ఆంతర్యమేంటి..!

 
విజయవాడ సిటీ : ఇటీవల జరిగిన కస్టోడియల్ డెత్‌పై మిస్టరీ వీడలేదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో నిందితుడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పే పోలీసు అధికారులు.. ఈ కేసు విషయంలో మాత్రం కస్టోడియల్ డెత్‌గా ధ్రువీకరించారు. ఇందుకు అనుగుణంగా నిబంధనలు మాత్రం పాటించలేదు. సాధారణంగా పోలీస్ కస్టడీలో ఎవరైనా మృతిచెందితే రెవెన్యూ అధికారులకు తెలియజేసి, వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారు. అయితే, పుల్లా వెంకట రమేష్ (28) మృతిపై మాత్రం పోలీసులు తొలి నుంచి పరస్పర విరుద్ధ కథనాలు చెబుతున్నారు. దీంతో రోజురోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి.
 
మొదటి నుంచీ రకరకాలు కథలు..


ఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, రమేష్ విదిలించుకొని కొంగల మందు మింగాడంటూ చెప్పారు. వెంటనే తాము ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, మృతిచెందినట్లు తెలిపారు. అయితే, రామవరప్పాడు రింగ్ నుంచి ప్రభుత్వాస్పత్రికి వెళ్లేందుకు ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. దీనిపై పలు విమర్శలు రావడంతో... రమేష్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో కొంగల మందు మింగాడని  ప్రకటించారు. బెదిరించేందుకు నాటకం ఆడుతున్నాడనుకుని పోలీసులు పట్టించుకోలేదని, నోటి నుంచి నురగ రావడంతో తొలుత ప్రైవేటు ఆస్పత్రికి, ఆపై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామని చెబుతున్నారు. పోలీసులు చెబుతున్నట్టుగా చిన్ననాటి నుంచే నేర చరిత్ర కలిగిన రమేష్ పోలీసులకు చిక్కిన వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అతని బంధువులు చెబుతున్నారు. కుటుంబ కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే ఎప్పుడో చేసుకునే వాడని, పోలీసులకు చిక్కిన తర్వాతే ఎందుకు చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు.
 
ముందే ఎందుకు తొందర..

చనిపోయిన వ్యక్తి ఏం మందు తీసుకున్నాడనేది పోస్టుమార్టం నివేదికలో వస్తుంది. అప్పటి వరకు వేచి చూడకుండా పంచానామా జరుగుతుండగానే కొంగల మందు తీసుకున్నాడని పోలీసులు ధ్రువీకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కొంగల మందు మింగినట్టు రమేష్ చెప్పినట్లు సమాచారం. అంతే గానీ అతను మింగిందేంటనేది పోలీసులకు తెలియదు. అయినా, గ్యాంగ్‌లు నిర్వహించే రమేష్ చనిపోయేందుకు పురుగుల మందు జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల మాటలను పరిశీలిస్తే జరిగిన తప్పును సరిదిద్దుకునే చర్యలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. రమేష్ ఉంటున్న గదిలో దొరికిన ఆధారాలను బట్టి ఓ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టినట్టుగా చెబుతున్న కొద్ది నగలను పోలీసులు మీడియాకు ప్రదర్శించారు. పెద్ద స్థాయిలో గ్యాంగ్‌లను నిర్వహించే వ్యక్తి వద్ద కొద్ది బంగారమే లభించిందని చెప్పడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కమిషనరేట్ పరిధిలో నేరగాళ్ల పట్టివేత.. సొత్తు స్వాధీనం వంటి వ్యవహారాలను సీసీఎస్ పోలీసులు పర్యవేక్షిస్తుంటారు.  మరి ఈ కేసులో సీసీఎస్‌ను విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. గుడివాడ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మూడు నెలలుగా రమేష్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సీపీ తెలిపారు. మూడు నెలల కిందట స్నాచింగ్ ముఠాల నేత సమాచారం వస్తే సీసీఎస్ పోలీసులకు కాకుండా పెనమలూరు పోలీసులే చూడటం వెనుక భారీ గోల్‌మాల్ జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.    
 
 

మరిన్ని వార్తలు