పేరూరు డ్యాంకు వరద నీరు

15 Sep, 2013 04:26 IST|Sakshi

రామగిరి, న్యూస్‌లైన్:  పేరూరు డ్యాంకు 14 ఏళ్ల  తరువాత జళకల సంతరించుకుంది.  వారం రోజులుగా కర్ణాటక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడంతో డ్యాంలోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు  ఎగువ ప్రాంతాన ఉన్న నాగులమడక, తిమ్మాపురం, మునిమడుగు, పెద్దపల్లి, రొద్దం తదితర చెరువులు నిండి పొంగిపొర్లి ఆ నీరంతా  డ్యాంకు చేరుతోంది.
 
  డ్యాం నీటి నిలువ సామర్థ్యం 1.5 టీఎంసీలు.  ప్రస్తుతం 25 శాతం నీరు చేరింది. డ్యాం కింద 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యాం పూర్తిస్థాయిలో నిండితే రామగిరి, కనగానపల్లి, కంబదూరు, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం తదితర ప్రాంతాలకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తాగు, సాగు నీటికి ఇబ్బందులు తీరుతాయి.   1995లో  డ్యాం పూర్తి స్థాయిలో నిండింది.  
 
 అనంతరం 2000 వేల సంవత్సరంలో సగం వరకు నీరు వచ్చింది. ఎండిపోయిన డ్యాంలోకి ప్రస్తుతం నీరు చేరుతున్నా లీకేజీల కారణంగా నీటి వృథా అవుతోంది. 15 సంవత్సరాలుగా  డ్యాం అభివృద్ధి పనులను  పట్టించుకోకపోవడంతో షట్టర్లు తుప్పు పట్టాయి. డ్యాంకు మొత్తం పది షట్టర్లు ఉండగా వాటిలో రెండు పెద్దవి. చిన్న షట్టర్లలో నాలిగింటిలో  భారీ స్థాయిలో లీకేజి కావడంతో  వచ్చి చేరుతున్న నీటిలో దాదాపు 10 శాతం వృథా అవుతోంది.  డ్యాంలో నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథా కాకుండా యుద్ధ ప్రాతిపదికన డ్యాం మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను వారు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు