‘పోలీసుల అదుపులో ఇద్దరు ప్రొఫెసర్లు’

13 Feb, 2020 16:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని  ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకొని స్థానిక ఎమ్మార్వో ముందు బైండ్‌ ఓవర్‌ చేస్తున్నామని విశాఖ డీసీపీ - 1 రంగారెడ్డి అన్నారు. ఏయూ ఎంఎల్‌ఆర్‌ విభాగానికి చెందిన కె.రమేష్‌బాబుపై 498ఏ కేసుతో పాటు అక్రమ సంబంధం ఆరోపణలు ఉన్నాయని రంగారెడ్డి వెల్లడించారు. కాగా, 498 ఏ కేసు ఇంకా విచారణలోనే ఉందని ఆయన అన్నారు.  సోషల్‌వర్క్‌ విభాగాధిపతి రాగాల స్వామిదాస్‌ విద్యార్థులు పట్ల ద్వందార్థ మాటలతో వేధిస్తున్నారని మీడియాలో కథనాలు రావటంతో సుమోటోగా తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇద్దరు ప్రొఫెసర్‌లను సీఆర్‌ పీసీ 41 /109 సెక్షన్ కింద అదుపులో తీసుకున్నామని తెలిపారు. ర్యాగింగ్‌ జరపకుండా కౌన్సిలింగ్ చేయాల్సిన ఆచార్యులే పోలీసులు, ఎమ్మార్వో కౌన్సిలింగ్ తీసుకోవటం దురదృష్టకరమన్నారు. 

అత్యున్నత సంస్థలో పనిచేసే వారు దిగజారి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రంగారరెడ్డి  అన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని రంగారెడ్డి చెప్పారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే ఏయూ క్యాంపస్‌లో వర్చువల్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తామని రంగారెడ్డి తెలిపారు. వర్చువల్ పోలీసు స్టేషన్‌ ద్వారా ఏయూ విద్యార్థులు ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ వీసీతో కలసి పోలీసులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డీసీపీ రంగారెడ్డి అన్నారు.
 

మరిన్ని వార్తలు