కడుపులోనే కత్తెర

2 Dec, 2019 13:28 IST|Sakshi
గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్ష చెప్పడం నేరమని జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన ప్రచార బోర్డు

యథేచ్చగా పీఎన్డీటీ యాక్ట్‌ ఉల్లంఘన 

లింగనిర్ధారణపై కొరవడిన నిఘా 

ఇష్టారాజ్యంగా అబార్షన్లు  

ఆడ పిల్లలపై చిన్నచూపు  

ఏటా తగ్గిపోతున్న బాలికల నిష్పత్తి 

చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ 

సాక్షి, నెల్లూరు:    జిల్లాలో లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు రహస్యంగా జరిగిపోతున్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. అమాయకత్వం, పేదరికం, అవగాహన లోపంతో కడుపులో పడింది ఆడపిల్ల అని గుర్తించి గ్రామీణులు అబార్షన్లు చేయించుకుంటున్నారు. అన్నీ తెలిసిన కొందరు వైద్యులే ధనార్జనే ధ్యేయంగా అబార్షన్లు చేస్తుండటంతో ఆడ పిల్లలు బాహ్యప్రపంచం చూడకుండానే పిండంగానే కాలగర్భంలో కలిసిపోతున్నారు. కాదు చంపేస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు ఆరోగ్యశాఖ సిబ్బందే పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆడ, మగ అని అడగటం, చెప్పడం చట్ట రీత్యా నేరం. ఇలాంటి ప్రభుత్వ నినాదాలన్నీ ఆస్పత్రుల గోడలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తగ్గిపోతుంది.

జిల్లాలో బాలికలు 939 మందే.. 
జిల్లాలో బాలికల శాతం నానాటికి దిగజారిపోతోంది. 2001లో వెయ్యి మంది పురుషులకు 984 మంది స్త్రీలు ఉండగా వీరిలో 0–6 ఏళ్ల లోపు ప్రతి వెయ్యి మంది బాలురకు 954 మంది బాలికలు ఉన్నారు. 2011 నాటికి 939కు చేరుకుంది. 2017  0–6 ఏళ్లలోపు వారిలో ప్రతి వెయ్యి మంది బాలురుకు 945 మంది బాలికలు ఉన్నారు. గతేడాది లెక్కల పక్రారం ప్రతి 1000 మంది బాలురుకు 928 మందే బాలికలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రతి వెయ్యి మంది బాలురుకు  953 మందికి పైగా బాలికలు ఉండాలని వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

ఇష్టారాజ్యంగా స్కానింగ్‌ కేంద్రాలు..  
జిల్లాలో ఇప్పటి వరకు  ప్రభుత్వ అనుమతి పొందిన 209 స్కానింగ్‌ కేంద్రాలు ఉండగా మరి కొన్ని కేంద్రాలు అనుమతి లేకుండానే పని చేస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు. గతంలో పని చేసిన డీఎంహెచ్‌ఓలు కొన్ని స్కానింగ్‌ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని స్కానింగ్‌ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేస్తున్నారు. దీంతో ఆడ శిశువు అని తెలియగానే వెంటనే అబార్షన్‌ చేయడం పరిపాటి అయింది. జిల్లాలో నెలకు 60కుపైగా అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి, గూడూరు, నెల్లూరు నగరంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకున్న సొంత స్కానింగ్‌ కేంద్రాల్లో ఈ తరహా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి.

మరి కొన్ని ఆస్పత్రుల్లో పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలను నిషేధించినా కొన్ని చోట్ల వాటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. పేదరిక భయం, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాసులకు కక్కుర్తి పడి కొందరు డాక్టర్లు యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే కరిగిస్తున్నారు. లేదంటే యథేచ్ఛగా ఆస్పత్రుల్లోనే అబార్షన్లు చేస్తున్నారు. దీని వల్ల జిల్లాలో బాలిక నిష్పత్తి తగ్గిపోతుంది. లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్‌ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖాధికారులు మాముళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్లు విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశించినప్పుడో, మీడియాలో వార్తలు వచ్చినప్పుడో తప్ప వారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు మేల్కోకపోతే భవిష్యత్‌లో అనంత నష్టం తప్పదంటున్నారు పలువురు వైద్య నిపుణులు. 

లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు 
స్కానింగ్‌ కేంద్రాల్లో లింగనిర్ధారణ చేసినట్లు రుజువైతే వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఘటనులు జరిగితే రూ.10 వేలు జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తాం. లింగ నిర్ధారణకు వ్యతిరేకంగా ఉన్న పీసీ, పీఎన్డీటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చట్టం అమలవుతోందో లేదో తెలుసుకునేందుకు త్వరలోనే ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.  
– జయశ్రీ, వైద్యశాఖమదర్‌ అండ్‌ చైల్డ్‌ డైరెక్టర్‌   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా