డిగ్రీ ప్రశ్నపత్రం లీకేజీ కలకలం!

31 Oct, 2019 08:17 IST|Sakshi
వాట్సప్‌లో లీకైన డిగ్రీ ప్రశ్నపత్రం , డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థులు

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఐదవ సెమిస్టర్‌ సబ్జెక్టు అయిన ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు కలకలకం రేగింది. నిర్దేశించిన పరీక్ష సమయం కంటే అర గంట ముందు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాన్ని పంపుతారు. ఎన్‌క్రిప్టెడ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా ఆయా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు అరగంట ముందు ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు అందజేస్తారు. అయితే బుధవారం మధ్యాహ్నం 1:45 ప్రశ్నపత్రం వాట్సప్‌లో హల్‌చల్‌ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గోరంట్ల, ఓడీ చెరువులోని డిగ్రీ పరీక్షల కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. వాట్సప్‌లో ప్రశ్నపత్రం వచ్చిన సమయాన్ని బట్టి బుధవారం మధ్యాహ్నం ప్రశ్నపత్రం లీకైనట్లు రూఢీ అవుతోంది. 

పేపర్‌ లీక్‌ కాలేదట!
నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందు ఎన్‌క్రిప్టెడ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకైతే 1:30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి చేరుకుంటారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రం 1:45 నిమిషాలకు బయటకు వచ్చినట్లయితే ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు కాదని ఎస్కేయూ ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు పేర్కొన్నారు. గోరంట్ల, ఓడీచెరువులోని డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను గురువారం సందర్శించి విచారణ చేపడతామన్నారు. ప్రశ్నపత్రం లీకైనట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. 

చర్యలు తీసుకోవాలని వినతి
ప్రశ్నపత్రం లీక్‌కు కారణమైన డిగ్రీ కళాశాల యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులుకు బుధవారం వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డాక్టర్‌ శ్రీధర్‌ గౌడ్, కుళ్లాయి స్వామి, వేమన, నరసింహ, రెడ్డి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు