శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

30 Aug, 2015 22:14 IST|Sakshi

శ్రీశైలం(కర్నూలు): ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం శ్రావణమాసం ఆదివారం వందలాది మంది భక్తులతో కిటకిటలాడింది. శనివారం వైఎస్ఆర్ సీపీ బంద్ కారణంగా భక్తుల రద్దీ సాధారణంగా కనిపించినా ఆదివారం ఉదయం 10గంటల తరువాత భక్తులరద్దీ ప్రారంభమైంది. దాదాపు 60వేలకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. కాగా నేడు శ్రావణమాసం మూడవ సోమవారం కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్న అధికారులు ఆదివారం రాత్రే సోమవారం నాటి ఆలయపూజావేళలను మార్పులు చేస్తూ మైకుల ద్వారా ప్రకటించారు. ఇందులో భాగంగా 3.30గంటల కు మంగళవాయిద్యాలు , 4 గంటలకు సుప్రభాతం, 5 గంటలకు మహామంగళహారతి 5.30 గంటల నుండి దర్శన,ఆర్జిత సేవలు ప్రారంభమయ్యేలా ఈఓ సాగర్‌బాబు ఏరాట్లు చేశారు.

ఆదివారం భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు జరుగకుండా అవసరమైన చర్యలను తీసుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని మల్లన్న స్పర్శదర్శనం రద్దు చేసి దూర దర్శనం ఏర్పాటు చేశారు. కేవలం అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. దర్శనానంతరం భక్తులు, స్థానిక సందర్శనీయ స్థలాలైన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార-పంచదారం, శిఖరేశ్వరం, నీలంసంజీవరెడ్డి డ్యాం తదితరాలను సందర్శించుకున్నారు. సోమవారం కూడా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విధులపై ఆయా ప్రదేశాలలో సిబ్బందిని నియమిస్తూ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు