ఇదెక్కడి న్యాయం..!

9 Aug, 2018 13:18 IST|Sakshi
పట్టణంలోని వీటీ అగ్రహారం బీసీ కాలనీలో ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం  

ఏఎన్‌ఎంల జీతాల్లో వ్యత్యాసం!

వెద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి జీతం రూ.18,970

సీఎం ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వారికి జీతం రూ.11,200

ఒకే రకం విధులు నిర్వహిస్తున్నా...వ్యత్యాసం రూ.6,770

వారంతా ఏఎన్‌ఎంలే...ఒకరు వైద్య ఆరోగ్య శాఖలో...మరొకరు సీఎం ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తారు. చేసే పని మాత్రం ఒక్కటే...జీతాల్లో ఎందుకో చెప్పలేనంత వ్యత్యాసం. అందుకే వీరిలో సీఎం ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వారికి ప్రభుత్వంపై చెప్పలేనంత అసంతృప్తి..అదే సమయంలో తమ జీవితంపై ఆవేదన...చేసే పని ఒక్కటైనా...వేతనాల చెల్లింపులో చూసే వ్యత్యాసంతో ఇదెక్కడి న్యాయమంటూ...ప్రశ్నిస్తున్నారు. 

విజయనగరం ఫోర్ట్‌: వారంతా ఒకే రకం విధులు నిర్వహిస్తారు. విద్యార్హత కూడా ఒక్కటే.. అయినా జీతాల్లో మాత్రం చెప్పలేనంత వ్యత్యాసం.  ఒకరు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే 2 ఏఎన్‌ఎంలు కాగా, మరొకరు ముఖ్యమంత్రి ఆరోగ్య  కేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు. జీతాల్లో వ్యత్యాసం ఉండడంతో  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు  ఆవేదన చెందుతున్నారు. ఒకే క్యాడర్‌ గల వారికి ప్రభుత్వం జీతాల్లో వ్యత్యాసం చూపడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. 

వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో..

వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 400కు పైగా 2వ ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. వీరికి ఒకరికి నెలకు రూ.18,970 జీతం. వీరు గ్రామాల్లో పిల్లలకు, గర్భిణులకు టీకాలు వేయించడం, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకునేలా మహిళలను ప్రోత్సహించడం, గర్భిణులకు వైద్య తనిఖీలు చేయించడం వంటి విధులు నిర్వహిస్తారు. 

ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో..

జిల్లాలో ఎనిమిది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. విజయనగరంలోని వీటీ అగ్రహారం, పూల్‌బాగ్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, లంకాపట్నంల్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అదే విధంగా సాలూరులో ఒకటి, బొబ్బిలిలో 2, పార్వతీపురంలో ఒకటి చొప్పన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ ఆరోగ్య కేంద్రంలోను ఇద్దరు చొప్పన 16 మంది ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు.

వీరికి నెలకు ఒకరికి జీతం రూ.11,200 ఇస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే వారికి, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారికి మధ్య వ్యత్యాసం రూ.6,770 ఉంది. సుమారు రూ.7 వేలు వరకు ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండడంతో వారు చేసిన విధులే మేము చేసినప్పటికి మాకు మాత్రం జీతం తక్కువగా ఇస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు  వాపోతున్నారు.

మరిన్ని వార్తలు