జర్నలిస్టు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా..

9 Aug, 2018 13:19 IST|Sakshi
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కోసం జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. రాజ్యసభలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జనతాదళ్‌(యునైటెడ్‌​) ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ గెలుపొందారు. జర్నలిస్టుగా పనిచేసి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు  పొందిన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు అన్ని పార్టీలు అభినందనలు తెలియజేస్తున్నాయి.

హరివంశ్‌ సింగ్‌ ప్రస్థానం...
‘లోక్‌ నాయక్‌’ జయ ప్రకాశ్‌ నారాయణ్‌ అనుచరుడిగా గుర్తింపు పొందిన హరివంశ్‌ జూన్‌ 30, 1956లో ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా సితాబ్‌ డయారా గ్రామంలో జన్మించారు(బిహార్‌లోని సరన్‌, ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ గ్రామంపై హ​క్కు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు ఇప్పటికీ పోటీ పడుతున్నాయి). బెనారస్‌ హిందీ యూనివర్సిటీలో డిగ్రీ చదివిన హరివంశ్‌ హిందీ దినపత్రిక ప్రభాత్‌ ఖబర్‌లో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైద్రాబాద్‌ బ్రాంచ్‌లో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హరివంశ్‌.. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు.

మొదటిసారి ఎంపీగా..
బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హరివంశ్‌ జేడీయూ తరపున 2014, ఏప్రిల్‌లో ఎంపీగా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. బిహార్‌కు ప్రత్యేక హోదా అనే డిమాండ్‌ను తెరపైకి తేవడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. బిహార్‌ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు జేడీయూతో చేతులు కలిపిన బీజేపీ.. రాజ్యసభ డిప్యూటీ పదవిని తమ పార్టీ ఎంపీకే కట్టబెట్టాలని జేడీయూ పట్టుబట్టడంతో.. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్‌ను బరిలో దింపింది. తమ ఎంపీ గెలుపు కోసం సీఎం నితీష్‌ కుమార్‌ వివిధ పార్టీల మద్ధతు కూడగట్టడంలో సఫలమయ్యారు. ఫలితంగా రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికలో ప్రత్యర్థి, కాంగ్రెస్‌ ఎంపీ హరిప్రసాద్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ హరివంశ్‌ విజయం సాధించారు.

1992 తర్వాత తొలిసారిగా..
గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్‌.. 1992 తర్వాత తొలిసారిగా ఓటింగ్‌ ద్వారా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. 1992లో జరిగిన ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై కాంగ్రెస్‌ అభ్యర్థి నజ్మా హెప్తుల్లా విజయం సాధించారు. ఆమె తర్వాత కె. రహమాన్‌ ఖాన్‌, పీజే కురియన్‌లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌లుగా పని చేశారు.

మరిన్ని వార్తలు