నగదు బదిలీకి రంగం సిద్ధం

14 Nov, 2014 03:54 IST|Sakshi
నగదు బదిలీకి రంగం సిద్ధం

* ఈ నెల 15 నుంచి అమల్లోకి
* రంగంలోకి దిగిన గ్యాస్ ఏజెన్సీలు
* ఆధార్ లేని వారికి యూనిక్ ఐడీ నంబర్లతో నగదు బదిలీ

 రామచంద్రపురం : గ్యాస్ వినియోగదారులకు మళ్లీ నగదు బదిలీ అమలుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఈ నెల 15నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఆధార్‌తో అనుసంధానం చేయడంతో గతంలో నగదు బదిలీకి పలు ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డీబీటీఎల్ పథకం ద్వారా నగదు బదిలీ చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  
 
డీబీటీఎల్ పథకం ద్వారా అమలు
ఆధార్‌తో సంబంధం లేకుండా డీబీటీఎల్ పథకం ద్వారా వినియోగదారులకు నగదు బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆధార్ సీడింగ్ లేని వారికి  ఈసారి నగదు బదిలీకి 17 అంకెల యూనిక్ ఐడీని గ్యాస్ ఏజెన్సీలు అందిస్తున్నాయి. ఇప్పటికే వినియోగదారుల మొబైల్ ఫోన్ల్‌కు 17 అంకెల యూనిక్‌ఐడీ నంబర్‌ను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపిస్తున్నారు. ఇదివరలో ఆధార్ సీడింగ్ అయినవారికి ఇది అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారు. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉండి, ఆధార్ సీడింగ్ జరగని వారికి ఆధార్ కార్డుతో పాటుగా రెండు రకాల ఫారాలను అందించాలి.

ఫారం-1, 2లను నింపి సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో, ఖాతా కలిగిన బ్యాంకులో అందించాలి. ఆధార్ కార్డు లేని వారు ఏజెన్సీలు అందించిన 17 అంకెల యూనిక్ ఐడీ నంబర్‌ను వేసి ఫారం-3, 4లను పూర్తి చేసి బ్యాంకుతో పాటుగా గ్యాస్ ఏజెన్సీలలో అందించాలి. ఈ ప్రక్రియ ఈనెల 15 నుంచి ఆయా గ్యాస్ ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నారు. అయితే గతంలో ఆధార్ సీడింగ్ ద్వారా నగదు బదిలీని అందుకున్నవారు ఎటువంటి ఫారాలు ఇవ్వాల్సిన పనిలేదు.
 
సిలిండర్‌కు పూర్తి సొమ్ము చెల్లించాల్సిందే
ఈ నెల 15 నుంచి నగదు బదిలీ అమలు కానుంది. జిల్లాలోని 54 గ్యాస్ ఏజేన్సీల ద్వారా దాదాపుగా తొమ్మిది లక్షల వరకు వంట గ్యాస్ వినియోగదారులున్నారు. వీరందరూ ప్రస్తుతం సబ్సిడీపై రూ.443 చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వినియోగదారులు ముందుగానే సిలిండర్‌ను రూ.960 చెల్లించి కొనుగోలు చే యాలి.

ఆ తర్వాత సబ్సిడీ మొత్తం రూ. 520 ఢిల్లీలోని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనికి జమ చేస్తారు. గతంలో నగదు బదిలీని అందుకున్న వారికి యథావిధిగా సబ్సిడీ సొమ్ములు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు లేనివారు సెల్‌ఫోన్‌కు వచ్చిన యూనిక్ ఐడీ నంబర్‌ను తీసుకువెళ్లినా బ్యాంకుల్లో సబ్సిడీ సొమ్ములను అందించనున్నారు.

>
మరిన్ని వార్తలు