ఇదేనా ‘ప్రగతి’

13 Oct, 2014 03:12 IST|Sakshi

* జిల్లా ప్రగతి నివేదికలో అస్తవ్యస్తంగా సమాచారం
* రూపకల్పనలోనూ అధికారుల అలసత్వం
* నిర్లక్ష్యాన్ని వీడని ప్రభుత్వ శాఖలు
ఒంగోలు: జిల్లా పరిషత్ పాలనా పగ్గాలు మూడున్నరేళ్లుగా అధికారుల చేతుల్లోనే ఉండటంతో వారిలో నిర్లక్ష్యం పాలు పెరిగి పోయింది. జెడ్పీ నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత ఈనెల 10వ తేదీ నిర్వహించి న తొలి సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులకు వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదికను జెడ్పీ అధికారులు పంపిణీ చేశారు. దాదాపు అన్ని శాఖలూ మొక్కుబడి సమాచారాన్నే అందించాయి.
* ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన గృహాల వివరాలను 2006 - 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు జీవో నంబర్ 171, రచ్చబండలకు సంబంధించిన వివరాలు మాత్రమే నివేదికలో పొందుపర్చారు. అంతే తప్ప ఆ శాఖ వద్ద ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం కోసం ఎంత
 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంత మందికి ఈ ఏడాది రుణం మంజూరు చేశారు, ప్రస్తుతం ప్రభుత్వం ఏయే పథకాలను అమలు చేస్తోంది, గత ప్రభుత్వంలో రుణం మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు బిల్లులు ఏమైనా చెల్లించారా తదితర వివరాలు ఏవీ పొందుపరచకపోవడం గమనార్హం.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్ పొందుపరిచిన సమాచారం కూడా అరకొరగానే ఉంది. అమ్మహస్తం పథకం సరుకుల కొనుగోలు లేదా పంపిణీ వివరాలు కేవలం ఏప్రిల్ 2014 వరకే ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి సరుకులను పంపిణీ చేస్తున్నారనే సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.  ఈ నెలలో భారీగా రేషన్ కార్డులకు కోత పడింది.ఆధార్ సమర్పించలేదంటూ 5.30 లక్షల కార్డులు తొలగించారు. అయినా కార్డుదారుల పాత వివరాలనే సమర్పించారు.

* ఈ వ్యవసాయ సీజన్‌లో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. అసలు విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఏయే రకం విత్తనాలు ఎంత మేరకు ఉన్నాయి. ఇంకా విత్తనాలు ఎంత మోతాదులో అవసరం అనే వివరాలు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువులు, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంతమేర పంటలను సాగుచేశారనే వివరాలను కూడా సభ్యులకు ఇవ్వకపోవడం గమనార్హం.
* జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి పంపిన సమాచారంలో కూడా కనీసం ఎన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు? గ్రంథపాలకులు లేనివెన్ని, నూతన భవనాల నిర్మాణం కోసం ఎక్కడెక్కడ స్థలాలు కావాలని విజ్ఞప్తి చేశారనే వివరాలు కూడా లేవు.
* జిల్లా విద్యాశాఖ పొందుపరిచిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో సభ్యుల ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. జిల్లాలో మొదటి దశలో మొత్తం 37 మోడల్ పాఠశాలల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతి లభించింది. వాటిలో 11 పాఠశాలలకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి.  5 నిర్మాణం పూర్తిచేసుకోగా...5 చోట్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఈ వివరాలను తెలియజేయడంలో విద్యాశాఖ అయోమయాన్ని సృష్టించింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారిపై జెడ్పీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్ మొత్తం మూడు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే కేవలం 27 మండలాల  సమాచారం మాత్రమే నివేదికలో ఉంది. మిగిలిన 29 మండలాల సమాచారం లేదు. అది కూడా కేవలం ఒక పథకానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చారు.   
* ఏపీబీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం ప్రగతి భవన్ వెనుక వైపు శంకుస్థాపన చేశారు.  దానిపై ఇప్పటి వరకు ఎటువంటి  పురోగతి లేదు. దాని నిర్మాణానికి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు.
* జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వివరాలే సభ్యులకు ఇచ్చిన పుస్తకంలో లేవు.

మరిన్ని వార్తలు