కోటి జోహార్లు!

11 Aug, 2015 02:27 IST|Sakshi
కోటి జోహార్లు!

ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన ఉద్యమ నేత మునికామకోటికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మృతదేహాన్ని చూసి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు చలించిపో యారు. అతని జ్ఞాపకాలను నెమరువేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నీ మనసు వెన్న.. ఆశయాలు మిన్న.. నిను మరువలేమన్నా.. అందుకో ఇవే మా జోహార్లు’ అంటూ పలువురు ఘన నివాళులర్పించారు.
 
తిరుపతి కార్పొరేషన్:  కోటికి జోహార్లు అర్పించారు. పలువురు ఆయన ఆఖరి ఘట్టానికి హాజరై అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ శనివారం ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన తిరుపతికి చెందిన బెంగళూరు మునికామ కోటి అలియాస్ బీఎంకే కోటి (41) ఆదివారం చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చె న్నైలోని కెఎంసీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని సోమవారం తిరుపతికి తీసుకొచ్చారు. నగ రంలోని మంచాల వీధిలో ఉన్న కోటి నివాసానికి తీసుకొచ్చారు. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోటి మృతదేహాన్ని చూడగానే  ఉద్వేగానికి లోనయ్యారు. అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తరలివచ్చి కోటి కుటుంబాన్ని ఓదార్చారు. మధ్యాహ్నం 3.40 గంటలకు బీఎంకే కోటి  అంతిమయాత్ర ప్రారంభమైంది. కోటి పాడిని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ బత్సల చెంగల్రాయులు మోసుకెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పపల్లకీ వాహనంలోకి ఎక్కించారు.

అశేష జనవాహిని భవానీనగర్ సర్కిల్, వీవీ మహల్ సర్కిల్, మాస్కూ రోడ్డు మీదుగా కోటి అంతమయాత్ర సాగింది. దారి పొడవునా ప్రజలు కోటి పార్థివ దేహాన్ని సందర్శించి పూల వర్షం కురిపించారు. కోటి ఆత్మహత్యకు పాల్పడిన మున్సిపల్ కార్యాయం వద్ద మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ కోటి మృతదేహంపై కాంగ్రస్ పార్టీ జెండా కప్పారు. ఇదే ప్రాంతంలో కోటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. అక్కడి నుంచి 4.30 గంటలకు హరిశ్చంద్ర శ్మశాన వాటికకు చేర్చారు. 4.41 గంటలకు చితిపై ఉన్న కోటి మృతదేహానికి ఆయన తమ్ముడు మురళి నిప్పుపెట్టి అంతిమ సంస్కారాలను అశ్రునయనాలతో పూర్తిచేశారు. కోటి మృతదేహానికి పలువురు ప్రముఖులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.
 
 

మరిన్ని వార్తలు