అధికారులకు రక్షణ లేదు...ఆడవారికి భద్రత లేదు

28 Jul, 2015 01:31 IST|Sakshi
అధికారులకు రక్షణ లేదు...ఆడవారికి భద్రత లేదు

టీడీపీ ప్రభుత్వంలో క్షీణించిన శాంతిభద్రతలు
మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి
 

మంగళగిరి : తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులకు రక్షణ లేదు.. ఆడవారికి భద్రత లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు క్షీణించడంతో రాష్ట్ర ప్రజలు అభద్రతతో ఆందోళనతో బతకాల్సివస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని తన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి తమ కార్యకర్తలు చెప్పినట్లు అధికారులు పనులు చేయాలని ఆదేశాలు జారీచేసినప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయని తాము హెచ్చరించామన్నారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడిచేసిన ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీనేతలను సాక్షాతూ ముఖ్యమంత్రే వత్తాసు పలికి ప్రభుత్వాస్తులను కాపాడిన అధికారులను తప్పుపడితే ఇక క్రింద స్థాయిలోకి ఏవిధమైన సంకేతాలు వెల్తాయని ప్రశ్నించారు.

పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలలో రెవెన్యూ అధికారులపై దాడులు చేసిన సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఆత్మకూరు ఘటనలు పునరావృత్తమయ్యేవి కాదన్నారు. ప్రభుత్వం ఎంతసేపటికి తమ నాయకులు కార్యకర్తల జుబులు నింపడనే విధంగా ఇసుక, మైనింగ్, మట్టి మాఫియాలను ప్రోత్సహిస్తూ అధికారులును భయబ్రాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలను ప్రోత్సహించకూడదని, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరాలని అభిలషించి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యాలయాల్లో కుల రాజకీయాలును ప్రోత్సహిస్తుండడంతో విద్యార్థిని రిషితేశ్వరి మృతి వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించడంతో పాటు విద్యాలయాల్లో రాజకీయాలను కుల సంఘాలను చేరనీయకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో సూచించారు.
 
 

మరిన్ని వార్తలు