వయసు దాటుతున్నా పింఛన్లు అందట్లేదు.. | Sakshi
Sakshi News home page

వయసు దాటుతున్నా పింఛన్లు అందట్లేదు..

Published Tue, Jul 28 2015 1:30 AM

no pensions in  age loss

శ్రీకాకుళం సిటీ: బాబూ మా వయసు చివరి అంకానికి చేరుకుంది... ఇప్పటికీ పింఛన్ మంజూరు కాలేదు.. జన్మభూమి కమిటీ లకు అనుకూలంగా ఉన్నవారికే పింఛన్లు మంజూరు చేస్తున్నారంటూ పలువురు వృద్ధులు కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంకు గోడు వినిపించారు.  కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వినతులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కలెక్టర్‌తో పాటు జేసీ వివేక్‌యాదవ్ తదితరులు ప్రజలనుంచి  వినతులు స్వీకరించారు. త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో డీఆర్‌వో, డీఆర్‌డీఏ పీడీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని...
 
  ఎచ్చెర్ల మండలం తోటపాలెం సమీపంలోని బావిలో తన కుమారుడు కిల్లంశెట్టి సాయికుమార్ గతనెల ఒకటో తేదీన అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటనపై సీఐడీతో విచారణ చేపట్టాలని పట్టణంలోని నానుబాల వీధికి చెందిన తండ్రి అనంతరావు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.  ఘటనతో సంబంధం ఉన్న నలుగురు స్నేహితులు బయటే తిరుగుతున్నారని, న్యాయం చేయాలని కోరారు.  వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎన్.ధర్మారావు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
 
  వికలాంగ సర్టిఫికెట్‌ను ఇప్పించాలని నరసన్నపేటకు చెందిన కె.వెంకటేష్, నేత కార్మికుడైన తన భర్త మరణించారని, తనకు అంత్యోదయ కార్డును మంజూరు చేయించాల్సిందిగా శ్రీకాకుళం పట్టణానికి చెందిన సత్యవతి కోరారు.  వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని పలాసకు చెందిన కె.బైరాగి,  గతంలో చేసిన ఇందిరమ్మ పచ్చతోరణం పనులకు ఇంతవరకు డబ్బులు మంజూరు కాలేదని రణస్థలానికి చెందిన ముద్దాడ వరలక్ష్మి కోరారు. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని పలాసకు చెందిన నల్లా వెంకటేష్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.  సైనిక ధళంలో పనిచేసినందుకు గాను ప్రభుత్వం ఎల్.ఎన్.పేట మండంలోని కొత్తపేట రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 189-91లో భూమిని ఇచ్చారని, అది నా అనుభవంలో ఉండగానే నాకు తెలియకుండా అమ్మకాలు చేశారని, భూమి హద్దులు కూడా తొలగించారని, తనకు న్యాయం చేయాలంటూ మాజీ సైనికుడు జె.కృపానందం గ్రీవెన్‌‌ససెల్‌లో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
 
 డయల్ యువర్ కలెక్టర్‌కు
 16 వినతులు డయల్‌యువర్ కలెక్టర్‌కు 16 వినతులు వచ్చాయి. పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, వాటిని బాగు చేయాలని వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురానికి చెందిన కె.రమణమ్మ కలెక్టర్‌కు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. అలాగే, పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పారిశుద్ధ్యం లోపిం చిందని ఎస్.ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సాం ఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో చదువుకునేందుకు సీటు ఇప్పించాలని మడ్డువలసకు చెందిన విద్యార్థిని నీలవేణి విజ్ఞప్తి చేసింది.
 
 ఎస్పీ గ్రీవెన్‌‌సకు ఏడు వినతులు
 జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఏడు వినతులు వచ్చాయి. జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు కూడా పది వినతులు వచ్చాయి. వినతులను త్వరతిగతిన పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ టి.మోహనరావు, హోంగార్డు ఆర్‌ఐ కూన రవికుమార్, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, మహిళా స్టేషన్ పీసీ శిరీష పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement